మామూలుగా అయితే ఈ టెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఉండాలి. ఎందుకంటే తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై శాసనమండలి ఏ విధంగా స్పందిస్తుందో ? పరిస్ధితి   ఓటింగ్  దాకా వస్తే ఎలా నెగ్గాలనే విషయంలో  జగన్ కు టెన్షన్ పెరిగిపోతుండాలి. కానీ అదేమిటో  చంద్రబాబులోనే టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే   జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. సరే మొదలైన మూడు రోజుల అసెంబ్లీ సమావేశంలో అవసరమైతే అంశాలపై ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్నారు. అసెంబ్లీలో సంఖ్యా బలం రీత్యా వైసిపికి తిరుగులేదు.  కానీ వ్యవహారం శాసనమండలికి వచ్చేటప్పటికి ఏమవుతుంది ?

 

శాసనమండలిలోని మొత్తం 58 మంది సభ్యుల్లో  టిడిపికి 28 మంది సభ్యులున్నారు. వైసిపికి తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. బిజెపికి ముగ్గురు, పిడిఎఫ్ కు 5 గురు, ఇండిపెండెం సభ్యులు ముగ్గురు ఉండగా  మిగిలిన స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. సరే ఓటింగ్ అంటూ జరిగితే  ప్రస్తుతమున్న సంఖ్యరీత్యా  అధికారపార్టీ ఓటమి ఖాయం. ఓటింగ్ జరిగితే  బిల్లులు  వీగిపోతాయో ? పెండింగులో పడతాయో ? లేకపోతే  సవరణలతో తిప్పి పంపుతారో ?  ఎవరికీ తెలీదు.

 

నిజానికి పై మూడింటిలో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డికి అవమానమనే చెప్పాలి. కాబట్టి మండలిలో బిల్లులను నెగ్గించుకునే విషయంలో జగన్ లో టెన్షన్ పెరిగిపోవాలి. కానీ రివర్సులో   చంద్రబాబులోనే టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటి ? ఏమిటంటే శాసనమండలిలో టిడిపికున్న 28 మంది సభ్యుల్లో 14 మంది గైర్హాజరయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు చంద్రబాబు టిడిఎల్పి సమావేశం పెడితే ఏడుగురు ఎంఎల్ఏలతో పాటు 12 మంది ఎంఎల్సీలు గైర్హాజరయ్యారు. దాంతో ఎంఎల్సీల మనోగతమేమిటో అర్ధంకాక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఓటింగంటూ జరిగితే  తమ ఎంఎల్సీలు జగన్ కే జై కొడుతారా ? లేకపోతే  తన ఆదేశాల ప్రకారం వ్యతిరేకంగా ఓట్లేస్తారా ? అన్నదే చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. అందుకనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: