జనసేన విధానం ఏమిటో తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు చెప్పామని కానీ ఆయన మాత్రం అధికార వైకాపా విధానాన్ని అసెంబ్లీలో వినిపించారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు . రాష్ట్ర రాజధాని ఒకే చోట కేంద్రీకృతమైతే ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని , మన ఆదాయాన్ని కూడా హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చించారని పేర్కొన్నారు . 

 

 అప్పుడు కనీసం  వెనుకబడిన జిల్లాల గురించి పట్టించుకుని ఉంటే , ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని అన్నారు . శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల ప్రజలు ఇప్పటికి వలసలు వెళ్తున్నారని రాపాక తెలిపారు . విశాఖ పరిపాలక రాజధాని అయితే వలసలు ఆగుతాయని అన్నారు . రాపాక అభిప్రాయానికి పూర్తి భిన్నంగా పవన్ స్పందించారు .  విశాఖ పై వైకాపా కు ప్రేమ లేదని , కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖపట్నం ను పరిపాలక రాజధాని అని అంటోందని చెప్పారు . ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖలోను ఫ్యాక్షన్ పడగలు విప్పేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు .

 

మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని జనసేన వ్యతిరేకిస్తుండగా , ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం సమర్ధించడం హాట్ టాఫిక్ గా మారింది . ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రాపాక కొన్నాళ్లు పార్టీ నాయకత్వం తో సత్ సంబంధాలను కొనసాగించారు .  ఆ తరువాత రాపాక,  అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతూ వచ్చారు . శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ రాపాక , జనసేన కు ఝలక్ ఇచ్చిన విషయం తెల్సిందే . 

మరింత సమాచారం తెలుసుకోండి: