గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతుంటే ఎవరైనా ఆసక్తిగా వినాల్సిందే. ఇక టీవీలో ఆయన మాటలు వినిపిస్తే సౌండ్ పెంచు మరి శ్రద్ధగా వింటూ ఉంటారు. అంతగా ఆయన ఇమేజ్ ఏపీలో పెరగడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ వెటకారం చేస్తూ కొడాలి నాని చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడే మాటలు అందరికీ ఆసక్తిని, వినోదాన్ని కలిగిస్తాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో నిన్న మూడు రాజధానుల  విషయంపై జరిగిన చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నాని తప్పు పట్టారు. రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో అమరావతి ఉందని, అటువంటి ప్రాంతాన్ని తరలిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని బాబు మాట్లాడుతున్నారని నాని విమర్శించారు.

 

అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబు గత కొద్ది రోజులుగా జోలె పట్టుకొని విరాళాలు సేకరిస్తున్న తీరుపైనా నాని స్పందించారు. చంద్రబాబు రాజధాని కోసం జోలు పట్టుకుని  అడుక్కోవడం చూస్తున్న ప్రజలు జీవితమంతా ఎటువంటి పొరపాట్లు, పాపాలు చేశాడో  చివరికి చంద్రబాబుకు ఈ గతి పట్టింది అనుకుంటూ... నవ్వుకుంటున్నారని నాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సభలో నవ్వులు వీరిసాయి. చంద్రబాబు చెప్పింది కరెక్ట్ అంటూ కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు రాస్తున్నాయని, ఏదో ఆకాశం నుంచి ఊడి పడిపోయినట్టుగా , తలకిందులు అయినట్టుగా అమరావతి గురించి వార్తలు రాస్తున్నారని, నాని తప్పుపట్టారు. 


రాష్ట్రాన్ని సమానంగా బాగు చేసేందుకే జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేశారని, కానీ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని నాని వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపుపై ఎవరికీ ఎటువంటి నష్టం లేదని నేను స్పష్టంగా చెప్పగలనన్నారు. తాను కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడినని, నేను అవసరమైతే ఉత్తరాంధ్ర కు వెళ్లి రాజకీయం చేసుకుంటానంటూ నాని చెప్పారు. రాజధాని అమరావతి నుంచి తరలించడం వల్ల కేవలం టిడిపి నాయకులకే ఇబ్బంది ఉందని, అందుకే ఇంతగా వారు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: