ఏపీ సీఎం జగన్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మూడు రాజధానుల బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు పిల్లనిచ్చిన అత్తగారి ఊరు నిమ్మకూరు అని.. అదే విధంగా మా మేనత్తను కూడా కృష్ణా జిల్లాలోని మైలవరం పరిధిలోని గణపవరంకు ఇచ్చామని చెప్పారు. నాది కూడా కృష్ణా జిల్లానే అంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
కృష్ణా జిల్లాతో తమకు అనుబంధం ఇప్పటిది కాదని 40 సంవత్సరాల నుండి తమ కుటుంబానికి చెందిన రాజ్, యువరాజ్ థియేటర్లు ఇక్కడే ఉన్నాయని అన్నారు. కృష్ణా జిల్లా ప్రజలు తమపై ప్రేమ చూపించారని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 2019 ఎన్నికలలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గెలిచిందని అన్నారు. 
 
కేవలం 4 స్థానాలలో మాత్రమే కృష్ణా, గుంటూరు జిల్లాలలో టీడీపీ గెలిచిందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి తనపై మంచి అభిప్రాయం ఉండటం వలనే వచ్చిందని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వలన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహానగరంగా అమరావతి కూడా మారడం ఖాయమని అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. 
 
తాను ప్రజలను మోసం చేయలేనని అభివృద్ధి చేసి చూపిస్తానని జగన్ అన్నారు. అన్ని కులాలు, మతాలు మరియు ప్రాంతాలు చల్లగా ఉండాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, కమ్మ, కాపు, రెడ్డి అందరూ ఓటు వేస్తే మాత్రమే తాము గెలిచామని జగన్ చెప్పారు. తాను గొప్ప సహచరులుగా భావించే కొడాలి నాని, తలశిల రఘురాం కమ్మవారు కాదా..? అని ప్రశ్నించారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని తనకు అటువంటి వ్యత్యాసాలు ఏమీ లేవని జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: