రాజధాని తరలింపుపై జగన్ దూకుడు చూస్తుంటే.. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చినట్లు, దానిపై ప్రధానితో ముందస్తుగానే మాట్లాడి విశాఖకు తరలించారన్నది నిజమనే తేలిపోయింది. అంటే.. బిజెపి నాయకత్వం, రాష్ట్ర పార్టీ నేతలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమయింది. బిజెపి పుణ్యపురుషులైన మోదీ-అమిత్‌షా, ఏపీలో జగన్‌తో ఒకవైపు దోస్తానా చేస్తూ, మరోవైపు అవకాశం కోసం చూస్తున్నారనీ అర్ధమవుతోంది. అందుకే ఇక్కడ రాజధాని తరలింపుపై రాష్ట్రంలో  ఎంత యాగీ జరుగుతున్నా, సీఎం జగన్ ఎలాగైతే ఇప్పటివరకూ పెదవి విప్పలేదో.. అదే అంశంపై సొంత పార్టీనే రంగంలోకి దిగినా, కేంద్ర నాయకత్వం పెదవి విప్పింది లేదు.

ఇంతకూ అమరావతి ఆటలో పులుసులో ముక్కలయింది ఎవరన్నది వీడని చిక్కుముడిలా తయారైంది. అంటే.. రాజధాని మార్పు గురించి ప్రధానికి సీఎం జగన్ చెప్పే చేస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు నిజమేనా? మరిప్పుడు ఏం చేయాలి? కమలసేన పోరాటం ఎవరిమీద చేస్తుంది? పాపం.. పవన్ కల్యాణ్ ఘీంకారాలు ఇక ఎవరిపై చేస్తారు? కమలానికి దొరకక దొరకక దొరికిన లడ్డూ లాంటి సమస్య చేజారిపోయిందే!? మరిప్పుడు బిజెపి రాష్ట్ర కమిటీ తీర్మానం మాటేమిటి?.. ఇవీ తెరపైకొచ్చిన ప్రశ్నలు.


రాజధానిని అక్కడే ఉంచాలని జరుగుతున్న రైతుల ఆందోళనకు అన్ని పార్టీల కంటే ముందుగానే బిజెపి మద్దతు ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, బిజెపి రంగంలోకి దిగితే రాజధాని తరలింపు ప్రక్రియ నిలిచిపోతుందని అటు రైతులు కూడా ఆశపడ్డారు. వారి మనోభావాలు గుర్తించిన తర్వాతనే కమలదళపతి కన్నా లక్ష్మీనారాయణ రాజధాని ప్రాంతానికి వెళ్లి, మోదీ శంకుస్థాపన చేసిన చోటనే మౌనదీక్ష నిర్వహించారు. అటు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా రైతుల వద్దకు వచ్చి భరోసా ఇచ్చారు. రాజధాని ఎక్కడికీ తరలిపోదని, కేంద్రం-బిజెపి నాయకత్వంతో మాట్లాడిన తర్వాతనే తాను ఈ విషయం చెబుతున్నానని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: