ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నోట పాత మాటే అంటే...తెలుగుదేశం పార్టీకి జైకొట్టేశారా? అనుకోకండి.  ప్ర‌స్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీనే పొగిడారు. కానీ పాత డైలాగ్ వాడారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటి డైలాగే... మ‌ళ్లీ పుర‌పాల‌క ఎన్నిక‌ల‌కు వాడేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎక్కడ చూసినా సారూ..కారూ..కేసీఆరే అంటున్నార‌ని సీఎం కేసీఆర్ కేబినెట్ స‌హ‌చ‌రుడైన ఎర్ర‌బెల్లి అన్నారు. వరంగల్‌ జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు. 

 


టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే మా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ప్ర‌జ‌లు నమ్మకంగా ఉన్నారని, ఎక్కడికి పోయిన జనం అపూర్వ స్వాగతం పలుకుతున్నార‌ని ఎర్ర‌బెల్లి చెప్పుకొచ్చారు. ``నేను అనేక ఎన్నికలు చూశాను. నా 36 ఏళ్ల‌ రాజకీయ జీవితంలో ఇంత వన్‌సైడ్‌ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అవతలివాళ్లు పోటీ ఇస్తే కదా! ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ సారథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు కాకుండా ఇంక దేనికి ఓటేస్తాం సార్‌ బహిరంగంగా చెప్తున్నారు.`` అంటూ ఎర్ర‌బెల్లి విశ్లేషించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్టు కూడా రావు రాసిపెట్టుకొండి అంటూ విప‌క్షాల‌ను షాక్ ఇచ్చారు.

 

రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఏ ఎన్నికల్లో అయినా వాళ్లు గెలిచారా? అప్పుడు గెలవలేదు. ఇప్పుడూ గెలవరు అంటూ విప‌క్షాల‌ను ఎర్ర‌బెల్లి ఎద్దేవా చేశారు. ``అసలు ఎన్నికలు ఆపాలని కోర్టుల్లో కేసులేసి, ఎట్ల ఎన్నికల్ని ఆపాలని చూసినవాళ్లు, ప్రపంచం మెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కడుతాంటే కూడా దాన్ని ఆపాలని కేసులేసిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజల మధ్యన లేకుండా ఎన్నికల్ని ఆపాలని, జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని చూసే కుట్రదారులకు ప్రజలకు ఓట్లేలా వేస్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల మద్దతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే ప్రజలకు బ్రహ్మాండమైన గౌరవం, విశ్వాసం ఉన్నది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదు. ప్రజల అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే టీఆర్‌ఎస్‌ ఉండాలని ప్రజలు విపరీతంగా మద్దతు ఇస్తున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నరు. ఎన్నికలు అనంగనే పండుగకు చుట్టాలొచ్చినట్టు వచ్చిపోయే పార్టీ టీఆర్‌ఎస్‌ కాదు. జనం మధ్యలో ఉండి. జనం కోసం పనిచేసే పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ప్రజలు ఏనాడో గుర్తించారు. అందుకే ఎన్నిక ఏదైనా ఫలితం టీఆర్‌ఎస్‌దిగా ఉంటుంది. రేపు అన్ని మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమై పోయింది. `` అంటూ స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: