పురపాలక ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలయ్యాయి.  ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. మొత్తం 56 లక్షల మంది వరకు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ ఎన్నికలు చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా జరుగుతుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్తంగా మారింది.  ముఖ్యంగా గద్వాల్ లో ఈ ఎన్నికల్లో రగడ మొదలైంది.  గద్వాల్ లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.  


ఈ క్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రదేశాన్ని సందర్శించారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు.  గొడవలకు కారణమైన వ్యక్తులను పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  గద్వాల్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే.  

 

ఇకపోతే, గద్వాల్ తో పాటుగా అటు ఆదిలాబాద్‌ జిల్లా రాంనగర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. బీజేపీ కార్యకర్త సంజయ్ తలకు గాయమైంది. మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.  కానీ, ఈ సహకారం ఎంతవరకు ఉంటుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  


ఇక ఇదిలా ఉంటె, న్నికల కోసం 7,961 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 55 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 50 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు.  అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్నది.  దీనిని బట్టి చూస్తుంటే, పురపాలక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే వాడిగా వేడిగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: