తెలంగాణ లో గత ఏడాది నుంచి వరుసగా ఎన్నకల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  గత ఏడాది చివర్లో జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తూనే ఉంది.  ఒక్క ఎంపీ ఎన్నికల విషయంలోనే కాస్త అంచనాలు తప్పాయి.  తాజాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా డబీర్‌పుర ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని డబీర్‌పుర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. డబీర్‌పుర ఉప ఎన్నికల సందర్భంగా డివిజన్‌లో 66 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

 

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. దొంగ ఓటర్లను గుర్తించడానికి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాల్లో గస్తీని ఏర్పాటు చేశామని ఏసీపీ ఆనంద్‌ తెలిపారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపై ఒత్తిడి తెస్తూ ఓ పార్టీ అభ్యర్థికే ఓటు వేసేలా వ్యవహరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో 25,876 మంది పురుషులతోపాటు 24,397 మంది మహిళలు, ఇతరులు ఇద్దరితో కలిపి 50275 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ 511 మందిని వివిధ స్థాయిలో విధులను కేటాయించిందన్నారు. 

 

ఇక ఎన్నికల పర్యవేక్షణ కోసం 40 మంది అధికారులను మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. డబీర్‌పుర ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మొదలైంది.  సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు. కాగా, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి బందోబస్తులో 12 మంది ఇన్‌స్పెక్టర్లతోపాటు 40 మంది ఎస్సైలు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, 5 ప్లాటూన్ల ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నామని ఏసీపీ ఆనంద్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: