తెలుగుదేశంపార్టీకి చెందిన ఇద్దరు శాసనమండలి సభ్యులపై పార్టీ నాయకత్వం అనర్హత వేటు వేయనున్నదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది.  మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్టం రూపం ఇచ్చేందుకు ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు  నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో పాసైన అధికార వికేంద్రీకరణ రాష్ట్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను  ప్రభుత్వం శాసనమండలికి పంపింది.

 

అసెంబ్లీలో బంపర్ మెజారిటి కారణంగా ఎటువంటి సమస్య లేకుండానే వైసిపి రెండు బిల్లులను గెలిపించుకున్నది. అదే మండలి విషయానికి వచ్చేసరికి సీన్ రివర్సయ్యింది. మండలిలో టిడిపికి మంచి మెజారిటి ఉంది. ఆనవాయితీ ప్రకారం బిల్లులను మండలిలో ప్రవేశపెట్టారు. అయితే మండలిలో బిల్లులపైన కాకుండా రూల్ 71పైన  చర్చ జరగాలని టిడిపి పట్టుబట్టింది.  రూల్ 71పై చర్చను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

 

మెజారిటి ఉందన్న కారణంతో ఛైర్మన్ కూడా టిడిపి వాదనకే మొగ్గు చూపారు. సరే తర్వాత చాలా గొడవలే అయ్యాయి.  మొత్తానికి రూల్ 71 పైనే చర్చ జరిగి తర్వాత ఓటింగ్ కూడా జరిగింది. రూల్ 71 అంటే మంత్రివర్గం చేసిన తీర్మానాలను తిరస్కరించే అధికారం అన్నమాట. మొత్తానికి రూట్ 71 పై జరిగిన ఓటింగ్ లో సహజంగానే వైసిపి ఓడిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపికి ఉన్న 26 ఓట్లలో 24 మాత్రమే పడ్డాయి.

 

అంటే తమకున్న ఓట్లలో కూడా రెండింటిని టిడిపి కోల్పోయింది.  ఈ రెండు ఓట్లు వైసిపికి అనుకూలంగా పడ్డాయి. దాంతో ముందు టిడిపి తర్వాత  చంద్రబాబు షాక్ కు గురయ్యారు. పోతుల సునీత, సివానంధరెడ్డి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు తేలింది. దాంతో  పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు  వాళ్ళిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ  పార్టీ నాయకత్వం శాసనమండలి ఛైర్మన్ కు లేఖ రాయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరి మరో ఇద్దరు ఎంఎల్సీలు శమంతకమణి, రాధాబాయ్ అసలు సమావేశాలకే హాజరుకాలేదు. మరి వీరి విషయంపై ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: