అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేస్తున్న ఆందోళన పై సీఎం జగన్ మండిపడ్డారు. పదే పదే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభకు అడ్డుతగులుతున్న సమయంలో సభా విషయంలో సభానాయకుడిగా జగన్ జోక్యం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసే విదంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి, స్పీకర్ ను అగౌరవ పరుస్తున్నారని, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

 

వాళ్లు అలా చేస్తుంటే ఇటు నుంచి రెచ్చి పోవడానికి అవకాశం ఉండదా అని జగన్ ప్రశ్నించారు. గట్టిగా పది మంది కూడా లేని టిడిపి ఎమ్మెల్యేలు గొడవ చేసి, రెచ్చగొట్టి ఏదో ఒక తగాదా పడి దాడి చేశారని వక్రీకరించి మీడియాలో వార్తలు వేస్తారని జగన్ అన్నారు.

 

టిడిపి ఎమ్మెల్యేలు వీది రౌడీలు మాదిరి వ్యవహరిస్తున్నారని, రౌడీలను ఏరిపారేయాలని అనుకుంటామని, వీళ్లు అలా ప్రవర్తిస్తున్నారని జగన్ అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ పట్ల టిడిపి సభ్యుల తీరు ఏ మాత్రం పద్దతిగా లేదని ఆయన అన్నారు. టిడిపి ఇలాగే చేస్తే తాము చర్య తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.పోడియం లో రింగ్ ఏర్పాటు చేసి, మార్షల్స్ ను పెట్టి వారు రింగ్ లోపలికి వస్తే బయటకు పంపే ఏర్పాటు చేయాలని అన్నారు.

 

అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుపడ్డారు. జై అమరావతి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పదే పదే అడ్డుతగిలారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సీఎంకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆందోళన చేయడం.. స్పీకర్ పోడియం ఎక్కిమరీ నిరసస తెలపడం సభలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: