పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కేంద్రంగా బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప్ర‌తిప‌క్షాలు శాయ‌శ‌క్తుల కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ విష‌యంలో  కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  సీఏఏకు అనుకూలంగా లక్నోలో మంగళవారం జరిగిన ఒక సభలో అమిత్‌షా మాట్లాడుతూ సీఏఏను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు వదంతులను వ్యాపింపజేస్తున్నాయని మండిపడ్డారు.

 

దేశ విభజన తరువాత పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనారిటీలైన హిందువులకు పౌరసత్వం ఇవ్వాలన్న తమ నాయకుల సూచనలను కాంగ్రెస్‌ నేతలు పెడచెవిన పెడుతున్నారని అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన ధ్వజమెత్తుతూ దళిత బెంగాలీలకు భారత పౌరసత్వం లభించకుండా ఆమె అడ్డుపడుతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో కాంగ్రెస్‌ పార్టీకి క‌ళ్లు  మూసుకుపోయాయని అంటూ.. ‘రాహుల్‌ బాబా క‌ళ్లు తెరిచి జాగ్రత్తగా వినండి..1947లో మీ పార్టీ చేసిన పాపాల కారణంగా దేశం మతం ప్రాతిపదికన చీలిపోయింది’ అని దుయ్యబట్టారు. 

 

సీఏఏ విష‌యంలో చేతనైతే బహిరంగ వేదికపై సీఏఏ మీద తనతో చర్చకు రావాలని ఆయన ప్రతిపక్ష నేతలను సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ తన సవాలు స్వీకరించాలని కోరారు. దేశ విభజన తరువాత పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, వీరంతా ఏమైపోయారని అమిత్‌షా ప్రశ్నించారు. మతం కారణంగా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో కొన్ని కోట్ల మంది హత్యలకు గురయ్యారని చెప్పారు. సభలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు, అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ డబ్బు కుమ్మరిస్తున్నదని ఆరోపించారు.ఒకరి పౌరసత్వాన్ని తొలిగించే నిబంధన ఏదీ సీఏఏలో లేదని స్పష్టం చేశారు.సీఏఏపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని నిరసన ప్రదర్శనలు చేసినా సీఏఏను ఉపసంహరించబోమని అమిత్‌షా స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: