ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల్లో క్యాబ్ డ్రైవర్ల నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. పలువురు ట్యాక్సీ డ్రైవర్లు కేజ్రీవాల్ పై పోటీకి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆప్ సర్కారు ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలు పట్టించుకోకవడం లేదని వారు ఆరోపించారు.

 

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాదాపు 93 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి కూడా సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్‌ దాఖలుకు ఆరుగంటలు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో 93 మంది సీఎంకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. సీఎంపై బరిలోకి దిగిన వారిలో ఐదుగురు క్యాబ్‌ డ్రైవర్లు, పది మంది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ మాజీ ఉద్యోగులు, నలుగురు సామాజిక కార్యకర్తలతో పాటు చక్ దే మూవీలో అతిథి పాత్ర పోషించిన జాతీయ స్థాయి హాకీ అథ్లెట్‌ కూడా ఉన్నారు. 

 

డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమానంగా వేతనం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో పాల్గొన్నందుకు.. ఉద్యోగం పీకేయడంతో.. ఓ అభ్యర్థి కేజ్రీవాల్ పై పోటీకి దిగారు. క్యాబ్‌ డ్రైవర్‌ పవన్‌ కుమార్‌ కూడా సీఎంకు ప్రత్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే ఎన్నికల బరిలో దిగామని ట్యాక్సీవాలాలు చెబుతున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జాతీయస్థాయి అథ్లెట్‌ శైలేంద్ర సింగ్‌ కూడా బరిలోకి దిగారు. ఆయన అంజాన్‌ ఆద్మీ పార్టీ నుంచి బరిలోకి దిగారు. 

 

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాల దాఖలులో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయలేదని ఢిల్లీ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ తనిఖీ చేయడానికి 30 నిమషాలు పడుతుందని ఈసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: