దేశంలో అమెజాన్‌ పెట్టుబడులతో ఎలాంటి మేలూ జరుగడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ పెద‌వి విరిచిన‌ప్ప‌టికీ...అమెజాన్ య‌జ‌మాని జెఫ్ బెజోస్ మాత్రం త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. రాబోయే ఐదేళ్ల‌లో భారత్‌లో మరో 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే దిశగా వెళ్తున్నామని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఆయ‌న తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. క్లైమేట్ ఛేంజ్ ను ఎదుర్కొనేందుకు ఇండియాకు తాము 10 వేల ఎలెక్ట్రిక్ రిక్షాలను అందజేస్తామని  ప్రకటించారు. వీటిని లాంచ్ చేసిన ఆయన.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్‌టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 


కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బెజోస్ వెల్ల‌డించారు.  40 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ బయటకు రాకుండా నిరోధించగలుగుతాయని జెఫ్ భావిస్తున్నారు. జెఫ్ బెజోస్ సంస్థ తయారు చేసిన ఎలెక్ట్రిక్ వాహనాల్లో మూడు, నాలుగు చక్రాల మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు డిజైన్ల వాహనాలను ఇండియాలోనే తయారు చేయడం విశేషం. కార్బన్ కాలుష్యాలను ఇవి చాలావరకు తగ్గిస్తాయని అమెజాన్ కంపెనీ భావిస్తోంది. గత కొన్నేళ్లలో భారత దేశంలో ఎలెక్ట్రిక్ మొబైలిటీ ఇండస్ట్రీ పురోగతి సాధించిందని, దీనివల్ల టెక్నాలజీ మరింతగా పుంజుకోగలిగిందని అమెజాన్ అభిప్రాయపడింది. తాము తయారు చేసిన ఎలెక్ట్రిక్ రిక్షాలు ఈ ఏడాది ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, నాగపూర్, కోయంబత్తూరు సహా మొత్తం 20 నగరాల్లో ప్రవేశిస్తాయని ఈ సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని తెలిపింది. కాలుష్యాన్ని  వెదజల్లని ఇలాంటి సుమారు లక్ష వాహనాలను మరికొన్నేళ్లలో వీధుల్లో తిప్పాలన్నది బెజోస్‌ లక్ష్యం.

 


కాగా, తమ సంస్థ తయారు చేసిన ఈ ఎలెక్ట్రిక్ రిక్షాల తాలూకు వీడియోను రిలీజ్ చేసిన అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు. 21 వ శతాబ్దం ఇండియన్ సెంచరీ అవుతుందని, 2025 సంవత్సరానికి భారతీయ ఎగుమతులు 10 బిలియన్ డాలర్ల మేర పెరగడానికి తమ సంస్థ తోడ్పడుతుందని అన్నారు. భారత్‌లో అమెజాన్‌ పెడుతున్న పెట్టుబడుల ద్వారా దేశానికి ఒరిగిందేమీ లేదని గోయల్‌ ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో బెజోస్ ప్ర‌క‌ట‌నలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: