వైసీపీ ఆకర్షిస్తోందో.. లేక టీడీపీ వదిలేసుకుంటోందో.. కానీ.. ఎమ్మెల్సీల్లో మరికొందరు కూడా వైసీపీ బాట పట్టనున్నారని తెలుస్తోంది. అసలు టీడీపీలో ఏం జరుగుతోందన్నదిపుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? ఈ డెవలప్‌మెంటు వెనుక వైసీపీ అధినాయకత్వం వ్యూహం వుందా? ఇదిప్పుడు అమరావతిలో పెద్ద చర్చకు తెరలేపింది. వాస్తవానికి ఒక అంశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, అయిదుగురు ఎమ్మెల్సీలు మండలిలోను పార్టీకి ఝలక్ ఇచ్చారు.  పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలంటూ టీడీపీ మండలి పక్షం ఛైర్మెన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. తద్వారా వారిని టీడీపీ స్వయంగా వైసీపీ వైపు నెట్టినట్లయింది. మూడు రాజధానుల అంశంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు లేవని ఆ పార్టీ చెబుతున్నా ఈ పరిణామాలు పార్టీ వాదనలో పస లేదని చాటుతున్నాయి. 

రాజధాని ఆందోళనతో జనంలోకి చొచ్చుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి సొంత నేతలే చెమటలు పుట్టిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు మండలిలోను పార్టీ సభ్యులు తీసుకుంటున్న యూ టర్న్‌లు… అధిష్టానానికి షాక్ పుట్టిస్తోంది. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా రాజధానుల బిల్లుకు మద్దతునివ్వగా.. ఇటు మండలిలోను ఇద్దరు ఎమ్మెల్సీలు డైరెక్ట్ ఝలక్ ఇచ్చారు. మరో ముగ్గురు ఇన్‌డైరెక్టుగా షాకిచ్చారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కలిగి వున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో డొక్కా మాణిక్య వరప్రసాద్.. బిల్లు సభకు రాకముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శమంతకమణి, శత్రుచర్ల విజయరామరాజు మండలి భేటీకి దూరంగా వున్నారు. సభకు హాజరైన శివానందరెడ్డి, పోతుల సునీత మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లుకు అనుకూలంగా, టీడీపీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ విధంగా తెలుగు తమ్ముళ్లు క్రమంగా జగన్ నాయకత్వాన్ని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అమరావతి ప్రాంత ఎమ్మెల్యే మద్దాలి గిరిలు జగన్ కు జై కొట్టారు. అదే బాటలు మరికొంతమంది ఉన్నట్టు సమాచారం. పార్టీలో ఇంత జరుగుతున్న చంద్రబాబు మాత్రం రాజధాని ప్రాంతంలో తాము, తమ అనుమాయులు కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారన్న వాదన స్వపక్షంలో బలంగా వినవస్తుంది. దీనితో చంద్రబాబు కేవలం 29 గ్రామాలకు పరిమితమవుతున్నారన్న వాదనకు ఆయన అనుసరిస్తున్న విధానమే స్పష్టం చేస్తుంది. అమరావతి భూములుంటే చాలు ఏమైనా సాధించుకోవచ్చన్న భావనలో చంద్రబాబు పార్టీని భ్రష్టు పాటించడానికి తెగబడుతున్నారన్న వ్యాఖ్య వినవస్తుంది.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: