ఓటు వేయ‌డంలో..చెత్త రికార్డు సృష్టించ‌డంలో కొన్ని ప‌ట్ట‌ణాలు ఎప్పుడూ త‌మ ముద్ర‌ను కోల్పోకుండా ఉంటాయోమో! ఇందులో హైద‌రాబాదీల‌ది ఇంక ప్ర‌త్యేక స్థానం. ఓట్ల విష‌యంలో ఎప్పుడూ బ‌ద్ద‌కం ప్ర‌ద‌ర్శించే న‌గ‌ర జ‌నం...పుర‌పోరులోనూ అదే ట్రెండ్‌ను కొన‌సాగించింది. తెలంగాణ‌లో బుధవారం జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. పలు మున్సిపాలిటీల్లో సగటున 80 శాతం నుంచి 90 శాతం వరకు పట్టణ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  జిల్లాల్లోని మున్సిపాలిటీలతో పోలిస్తే.. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో పోలింగ్‌శాతం కొంతమేర తక్కువగా నమోదైంది. కాగా, మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలు ఎక్కువగా తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. 68.80% పురుషులు ఓట్లు వేయగా.. 69.94% మంది మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. 

 

ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సగటున 70.26 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం 9 గంటల వరకు 15.40 శాతం పోలింగ్‌ కాగా, 11 గంటల వరకు 36.63%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.89%, మూడు గంటల వరకు 67.46% పోలింగ్‌ జరిగింది. సాయం త్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసేసరికి మొత్తం మీద 70.26% నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 93.31 శాతం ఓట్లు పోలవగా.. అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం ఓట్లు పోలయ్యాయి. కొత్తఓటర్లతో పాటు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు పూర్తిస్థాయిలో పడినట్లు తేలింది. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఓటు చైతన్యం పెరిగింది. 

 

మ‌రోవైపు, పట్టణాల పరిధిలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలతో కలిపి మొత్తంగా 67.7 శాతం పోలింగ్‌ నమోదైంది. అంతకుముందు 2014 లో జమిలి ఎన్నికల్లో 68.69 శాతం.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 62.69 శాతం ఓటింగ్‌ జరిగింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటు పోలింగ్‌శాతం కేవలం 39.49 మాత్రమే నమోదైంది.మొత్తం 11,099 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్‌ బాక్సులను గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్దేశిత స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 25 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: