తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండి అమరావతి ప్రాంతం లో వందల కోట్ల రూపాయల భూములు కొనుగోలు చేసిన వారిపై సిఐడి కేసులు నమోదు చేసి విచారిస్తోంది . అమరావతి రాజధాని పరిధిలో 796 మంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి , ఎకరా మూడు కోట్ల రూపాయల వెచ్చించి భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు . అమరావతి ప్రాంతం లో భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వైకాపా ప్రభుత్వం  మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెల్సిందే .

 

ప్రభుత్వ పెద్దలు చేస్తోన్న  ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా సిఐడి కీలక ఆధారాలను సేకరించింది .    సుమారు 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కలిగి ఉన్న వారు  , ఎకరా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఎలా  భూములు కొనుగోలు చేశారన్న ప్రశ్న  తలెత్తుతోంది . దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారికే ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తుంటాయి . అటువంటి వారు  మూడు కోట్ల రూపాయలు వెచ్చించి , ఎకరా భూమి కొనుగోలు చేయడం అన్నది అసాధ్యమని తేటతెల్లం అవుతోంది . తెల్లరేషన్ కార్డుదారులు పేరిట ఇతరులెవరో భూములు కొనుగోలు చేసి , వారిని బినామీలుగా చూపెట్టారని స్పష్టం అవుతోందని అధికారులు చెబుతున్నారు . ఈ బినామీ భాగోతం నడిపిన వారు ఎవరన్నది, తెల్ల రేషన్ కార్డు  దారులను లోతైన విచారణ జరిపితే బట్టబయలు అవుతుందని అంటున్నారు .

 

అమరావతి ప్రాంతం లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బినామీల పేరిట భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అసెంబ్లీ వేదిక గా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు , ఇప్పుడు బలమైన ఆధారాలు లభించినట్లయింది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . ఇన్నాళ్లు తాము ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతుంటే , ఆధారాలు చూపించమంటున్న టీడీపీ నేతలు ఇప్పుడేమి చెబుతారని ప్రశ్నిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: