రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలే కారణమా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఎలా కారణమవుతారన్న ప్రశ్న తలెత్తకమానదు . అయితే అసెంబ్లీ లో సంపూర్ణ మెజార్టీ ఉన్న వైకాపా కు , మండలిలో మాత్రం ఆధిక్యత లేదన్నది విషయం జగమెరిగిన సత్యమే .

 

రాష్ట్రం లో వైకాపా అధికారం లోకి రాగానే ,  ఎంతోమంది  విపక్షానికి చెందిన ఎమ్మెల్సీలు పార్టీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించారని కానీ జగన్మోహన్ రెడ్డి దానికి నిరాకరించారని తెలుస్తోంది . ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్సీ పార్టీలో చేరాలనుకుంటే , తమ పదవికి రాజీనామా చేసి చేరాలని షరతు విధించారని పార్టీ వర్గాలు  అంటున్నాయి . ఆలా కాకుండా ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటే , మండలిలోనూ వైకాపా కు ఆధిక్యత లభించి ఉండేదని చెబుతున్నారు  . అసెంబ్లీ లో వికేంద్రీకరణ బిల్లు , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందగానే , మండలి లో మంత్రులు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు . మండలిలో   టీడీపీ సభ్యులు రూల్ 71 ను తెర పైకి తీసుకువచ్చి , బిల్లులను అడ్డుకున్నవిషయం తెల్సిందే .

 

బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపడం ద్వారా, రాష్ట్రం లో  మూడు  రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుకట్ట వేసినట్లయింది . ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీ కి పంపడం ద్వారా, రాజధానుల ఏర్పాటు చేయడానికి మరో మూడు నెలల వ్యవధి పట్టే అవకాశాలున్నాయి. మండలి పరిణామాలపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఏకంగా మండలి రద్దుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: