పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికలే ఆఖరివి. గడిచిన నాలుగేళ్లలో ఎన్నికలు ఒక ఎత్తయితే... మున్పిపల్ ఎన్నికలు మరో ఎత్తు. ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్నిపల్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీటుగానే ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టాలనే ప్రయత్నం చేసింది క్యాడర్. మున్సిపల్ ఎన్నికల్లో సరళి చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ చేతులెత్తేయలేదు కానీ... పోటీ అయితే ఇవ్వగలిగామనే అంచనాలు వేసుకుంది పార్టీ. 

 

మున్సిపల్ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య సవాల్ గానే జరిగాయి. అధికార పార్టీ గడిచిన ఎన్నికల ఫలితాలు చూసి... వార్ వన్ సైడ్ గానే ఉంటాయని ధీమాతో ఉంది. కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడిందనే వాదన కూడా ఉంది. ఐతే మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్ధితి ఏమీ కనపించలేదంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన క్షేత్రస్ధాయి నాయకులు అంతా సవాల్ గానే తీసుకుని పనిచేశారనే అంచనాలు వేస్తోంది. సొంత ఎన్నికలు కావటంతో...ఆర్ధికంగా కూడా అభ్యర్ధులు కొంత ముందడుగే వేశారని పీసీసీ లెక్కలేస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్..20 నుంచి 30 మున్సిపాలిటీలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగామనే అంచనాలు వేస్తుంది. డబుల్ డిజిట్ మున్సిపాలిటీలు గెలిచి తీరుతామంటుంది కాంగ్రెస్.  

 

రాజకీయంగా కాంగ్రెస్ కి కలిసి వచ్చే జిల్లాల మీదే ఎక్కువ ఆశతో ఉంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ప్రాతినిద్యం వహిస్తున్న నల్గొండ జిల్లాలో ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోగలుగుతామనే ధీమాతో ఉంది. నల్గొండ జిల్లాలనే పరువు నిలబెడుతుందని భావిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో  ఉన్న కార్పొరేషన్లలో ఏదో ఒకటైనా రాకుండా పోతుందా..? అని చూస్తుంది. వరంగల్ జిల్లాలో జనగామ కూడా తన ఖాతాలోకి వస్తుందనే ధీమాతో ఉంది. మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేటలో ఏదో ఒకటి తన ఖాతాలోకి రావటం ఖాయం అనుకుంటుంది. ఖమ్మం జిల్లాలో వైరా, మధిరలు చేజిక్కించుకుంటామనే ధీమాలో ఉన్నారు సీఎల్పీ నేత భట్టి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రాతనిద్యం వహించిన హుజూర్ నగర్ లోని రెండింట్లో ఏదో ఒకటి వస్తుందనే అంచనాలు వేసుకున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ... కామారెడ్డి మున్సిపాలిటీ మాదే అంటున్నారు. ఎవరి అంచనాలు...ఎలా ఉన్నా ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది ఈ నెల 25 న అందరి తేలనుంది. కాంగ్రెస్ మాత్రం తన అంచనాల కంటే మెరుగైన ఫలితాలే వస్తాయని ధీమాతో ఉంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: