మూడు రాజధానులు ఏర్పాటు సిఆర్డిఏ రద్దు పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికిగాను జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ శేష సాయి, జస్టిస్ సత్యనారాయణ ఈ దర్మాసనంలో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు, మూడు రాజధానులపై నిర్ణయం, సిఆర్డిఏ రద్దు పై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరపున న్యాయవాది ఏజీ శ్రీరామ్ సుబ్రమణ్యం తన వాదనను వినిపించారు.


 అయితే బిల్లు ఏ దశలో ఉందని న్యాయవాదిని ప్రశ్నించడంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి మండలికి వెళ్లిందని అక్కడి నుంచి సెలెక్ట్ కమిటీకి పంపించామని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం తామంతా ఎదురు చూస్తున్నామని, ఆయన కోర్టుకు తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుతం ఈ బిల్లు పై విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. విచారణ చేయకపోతే ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను వైజాగ్ తరలిస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకవేళ విచారణ పూర్తయ్యే లోపు కార్యాలయాలను తరలిస్తే దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 


 ఇక రాజధాని తరలింపు పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇక రాజధాని వికేంద్రీకరణ పై నమోదైన కేసుల విచారణను ఈ నెల 26 వ  తేదీకి వాయిదా వేశారు. బిల్లు చట్టంగా మారడానికి కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆ లోపు కనుక ప్రభుత్వ విభాగాలను తరలిస్తే దానికయ్యే ఖర్చు మొత్తం వ్యక్తిగత ఖాతా నుంచి జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: