కొన్ని దేశాలు త‌మ గురించి ఎక్కువ ఊహించుకుంటాయి. దానికి తోడు మ‌తం అనే కోణం కూడా తోడ‌యితే ఇంకేముంటుంది? మలేషియా దేశం గురించే ఇదంతా. పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్‌ అంశంలో మలేషియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అనుభ‌విస్తోంది. అయితే, తేడా కొడుతున్న నేపథ్యంలో కాళ్ల‌ బేరానికి దిగివ‌చ్చింది.

 

ఇటీవ‌ల ఐక్యారాజ్య స‌మితి సర్వసభ్య సమావేశంలో మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించింది. మలేషియా నుంచి పామాయిల్‌ కొనుగోలు చేయరాదని దేశీయ వ్యాపారులను ఆదేశించింది. దీంతో భారత్‌కు అతిపెద్ద పామాయిల్‌ ఎగుమతిదారుగా ఉన్న ఆ దేశంపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం  చూపించింది. మలేషియా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్ర‌భావితం అయిన నేప‌థ్యంలో,  వివాదాన్ని మలేషియా పరిష్కరించుకునేందుకు ప్రత్యామ్నాయ బాట పట్టింది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి చక్కెర కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించుకుంది.

 

పామాయిల్‌ను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా. ఇక మలేషియాకు అతిపెద్ద దిగుమతిదారు భారత్‌. గత ఏడాది ఈ దేశం నుంచి 4.4 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు మలేషియా ఎగుమతుల విలువ 10.8 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక దిగుమతుల విలువ 6.4బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తి సంస్థ అయిన ఎఫ్‌జీవీ హోల్డింగ్స్ మ‌లేషియా దేశానికి చెందింది. పామాయిల్‌ దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేప‌థ్యంలో...ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) భారత్‌ నుంచి 49.20 మిలియన్‌ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెర కొనుగోలు చేయనున్నట్లు ఎంఎస్‌ఎం మలేషియా హోల్డింగ్స్‌ బెర్హాడ్‌ వెల్లడించింది. 2019లో ఈ కంపెనీ భారత్‌ నుంచి 88,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: