తెలుగుదేశం పార్టీ నాయకత్వం మరోసారి అడ్డంగా బుక్కయింది . మండలి చైర్మన్ షరీఫ్ ను మంత్రులు , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లు , అసభ్య పదజాలం తో  దుర్భాషలాడారని  టీడీపీ నాయకులు  చేస్తున్న వాదనలో ఏమాత్రం నిజం లేదని షరీఫ్ పరోక్షంగా తేల్చి చెప్పారు . బుధవారం శాసనమండలి లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు లను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , బొత్స సత్యనారాయణ లు ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే .

 

ఈ సందర్బంగా టీడీపీ సభ్యులు రూల్ 71 ను తెరపైకి తీసుకువచ్చి బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేశారు .  మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణ అధికారంతో , పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు . ఆ సమయంలో మండలి చైర్మన్ పోడియం వద్ద తీవ్ర గలాటా చోటు చేసుకుంది . ఒక వైపు మంత్రులు , మరొకవైపు టీడీపీ సభ్యులు ఆయన్ని చుట్టుముట్టారు . ఈ సందర్బంగా  మండలి చైర్మన్ ను మంత్రులు దూషించడమే కాకుండా , ఆయన మతాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే . ఇదే విషయమై షరీఫ్ తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి తణుకు లో మీడియా తో మాట్లాడుతూ , తనని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు , మంత్రులు ఎవరు దూషించలేదని స్పష్టం చేశారు .

 

మంత్రులు తనని బెదిరించినట్లుగా వచ్చిన వార్తలు కూడా నిరాధారమైనవని చెప్పారు . ఇక తాను ఎవరి ఒత్తిళ్లకు లొంగి నడుచుకోలేదని చెప్పారు .  దీనితో టీడీపీ నాయకత్వం ఆత్మరక్షణ లో పడినట్లయింది . చైర్మన్ ను మంత్రులు దూషించారని  తాము చెబుతుంటే , షరీఫ్ దానికి భిన్నంగా స్పందించడం పట్ల ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి లో ఆ పార్టీ నాయకత్వం ఉంది  . 

మరింత సమాచారం తెలుసుకోండి: