కేంద్రంలో రెండు చట్టసభలు ఉన్నాయి.  ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడిన లోక్ సభ.  రెండోది ఎంపీల చేత ఎన్నుకోబడే రాజ్యసభ.  లోక్ సభకు ఉన్న ప్రాధాన్యత రాజ్యసభకు ఉండదు.  రాజ్యసభను ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.  లోక్ సభలో సీట్ దక్కని వ్యక్తులు... టాలెంట్ ఉండి మంత్రిపదవి దక్కినా... ప్రజలు గెలిపించకపోతే వాళ్ళను రాజ్యసభ ఎంపీగా చేసి పదవి ఇస్తుంటారు.  ఆశావహులకు కూడా ఈ పదవులు ఇస్తుంటారు.  ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.  అధికారంలో ఉన్న పార్టీకే రాజ్యసభలో మెజారిటీ ఉంటుంది అనుకోవడం పొరపాటు.  


రాజ్యసభలో ఒక్కోసారి అధికారపార్టీకి ఉండొచ్చు.  మరోసారి ప్రతిపక్షానికి ఉండొచ్చు.  చెప్పలేం.  ఇదే విధంగా రాష్ట్రాల్లో కూడా.  ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రాల్లో శాసనమండలిని ఏర్పాటు చేస్తారు.  దేశంలోని అన్ని రాష్ట్రల్లో శాసనమండలి లేదు. ఇప్పుడు కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1958 జులై 1 వ తేదీన ఏర్పాటు కాగా, జులై 7 నుంచి అమలులోకిఅచ్చింది .  అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జూబ్లీహాల్ లో ఈ సభను ఏర్పాటు చేశారు.  


అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నది.  అయితే, 1983 మార్చి 24 వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలి రద్దుకు తీర్మానం చేశారు.  అసెంబ్లీలో తీర్మానించి దానిని కేంద్రానికి పంపించారు.  అప్పటి శాసనమండలిలో మొత్తం 90 మంది సభ్యులు ఉంటె, తెలుగుదేశం పార్టీకి కేవలం 6 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.  దీంతో బిల్లులు ఆగిపోతున్నాయి.  దాన్ని భరించలేక ఎన్టీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ, అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మండలి రద్దుకు ఒప్పుకోలేదు.  తిరిగి వెనక్కి పంపించింది.  


ఆ తరువాత మరలా 1985 వ సంవత్సరంలో ఎన్టీఆర్ మరోసారి తీర్మానం చేసి మండలి రద్దుకు కేంద్రాన్ని పంపించారు.  1985 ఏప్రిల్ 24 వ తేదీన కేంద్రం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి మండలిని రద్దు చేసింది.  అయితే, 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వం మరోసారి మండలిని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు.  చివరకు 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా మండలిని పునరుద్ధరించారు.  రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఇప్పుడు మరలా మండలి గురించి చర్చ జరుగుతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: