తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ, శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ చంద్రబాబునాయుడుతో పాటు పార్టీకి కూడా పెద్ద షాక్ ఇచ్చాడా ? జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పాసైన రెండు బిల్లులను శాసనమండలిలో సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛైర్మన్ చేసిన ప్రకటనపై ఎంత గందరగోళం జరుగుతోందో అందరూ చూస్తున్నదే.

 

మండలిలో సెలక్ట్ కమిటి వేడి చల్లారిన తర్వాత నియమ, నిబంధనల గురించి మెల్లిగా వాస్తవాలు బయటకు వచ్చాయి. మంగలి నిబంధనల ప్రకారం ఏ బిల్లునైనా తనంతట తానుగా  సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపే అధికారం ఛైర్మన్ కు లేదట.  ఎవరైనా సభ్యుడు డిమాండ్ చేస్తే మాత్రమే బిల్లును సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు సభ్యుడి పేరు మీద సభలో అభిప్రాయం లేదా ఓటింగ్ ద్వారా మాత్రమే సెలక్ట్ కమిటికి ఛైర్మన్  పంపగలరట.

 

రెండు బిల్లుల విషయంలో టిడిపి సభ్యులెవరూ  అడగాల్సిన సమయంలో సెలక్ట్ కమిటికి పంపమని అడగలేదు. పోనీ చివరలో అడిగినా ఛైర్మన్ సభలో అభిప్రాయాలు కానీ లేదా ఓటింగ్ కానీ జరపకుండానే తనంతట తానుగా విచక్షణాధికారాలు అంటూ ప్రకటించేశారు. అంటే ఛైర్మన్ చేసిన ప్రకటన చెల్లుబాటు కాదు.

 

 ఇక రెండో అంశం ఏమిటంటే లేని అధికారాలతో సెలక్ట్ కమిటికి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించేసిన ఛైర్మన్ మరచిపోయిందేమిటంటే కమిటిని నియమించకుండానే  మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. ఏ  బిల్లునైనా  సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపాలని సభ తీర్మానించిన తర్వాత  కమిటిలో సభ్యులెవరుండాలో కూడా అప్పుడే  నిర్ణయమైపోతుంది. ఒకవేళ అప్పటికప్పుడు కమిటిని వేయటం సాధ్యం కాకపోతే ఓ రెండు రోజుల తర్వాతైనా వేస్తారు. అదికూడా సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నేతల ఆమోదంతోనే. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే సెలక్ట్ కమిటియే లేదని.

 

మరి కమిటియే లేనపుడు అసలు పరిశీలన అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా ? పైగా సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ సభ ఎప్పుడు సమావేశం అవ్వాలి ? అసలు సభ ఉనికే ప్రశ్నార్ధమవుతున్న దశలో సెలక్ట్ కమిటి ఎక్కడుంది ? ఎవరు పరిశీలిస్తారు ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: