రాజధాని బిల్లుకు మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సీఐడి అస్త్రం సంధించడానికి  రంగం సిద్ధం చేయడం ఆసక్తికరంగా మారింది. అమరావతిలో 129 ఎకరాలను 131 మంది తెల్లకార్డుదారులు, పెదకాకానిలో 40 ఎకరాలు 43 మంది, తాడికొండలో 190 ఎకరాలు 188 మంది, తుళ్లూరులో 242 ఎకరాలను 238 మంది, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది, తాడేపల్లిలో 24 ఎకరాలను 49 మంది తెల్లరేషన్‌కార్డుదారులు భూములు కొనుగోలు చేశారంటూ సీఐడి కేసులు నమోదు చేసింది.ఈ కేసులో అసలు వ్యక్తులు బయటకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ కేసు ద్వారా టిడిపిలో ‘భూ’కంపం  సృష్టించడం ద్వారా, రాజధాని భూములను టిడిపి నాయకులే బినామీల ద్వారా కొనుగోలు చేశారని విమర్శించేందుకు మాత్రం ఒక అస్త్రంగా పనికి వస్తుంది.
రాజధాని భూముల అస్త్రం సంధించింది. అందులో భాగంగా మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావుతోపాటు బెల్లంకొండ నరసింహారావుపై ఇన్‌సైడర్ ట్రేడింగుకు సంబంధించి సీఐడి కేసు నమోదు చేసింది. దీనికి ఎస్పీగా వ్యవహరిస్తున్న మేరీ ప్రశాంతి చేసిన ప్రకటన పరిశీలిస్తే... రాజధాని తరలింపు చట్టబద్ధమయ్యేవరకూ, టిడిపిలో భూకంపం సృష్టించడమే వైసీప లక్ష్యంగా కనిపిస్తోంది. రాజధాని వికేంద్రకరణ, సీఆర్డీఏ  బిల్లు వీగిపోయి 24 గంటలు కూడా గడవకముందే, ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడి కేసులు నమోదుచేయడం ద్వారా చంద్రబాబుకు జగన్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశమయింది.  

నిబంధనలకు తగినట్లుగానే తెల్లకార్డులున్నప్పటికీ, వందల సంఖ్యలో భూములు ఎలా కొనుగోలు చేశారన్న చర్చకు తెరలేచింది. తెల్లరేషన్ కార్డులు కేవలం పేద, మధ్య తరగతి వారికి  మాత్రమే కేటాయిస్తారు. దానికి అల్పాదాయవర్గాలు మాత్రమే అర్హులు. కానీ, 797 తెల్లకార్డుదారులు  220 కోట్లతో భూములు కొనడం, 3 కోట్ల చొప్పున ఎకరం భూమి కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడం బట్టి,  తెల్లకార్డుదారులే బినామీదారులన్న భావన బలపడుతోంది. వీరి వెనుక నాటి టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని, వారఐదరికీ ఈ తెల్లకార్డుదారులు బినామీలుగా భూములు కొన్నారన్న అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.

అయితే, సర్కారు ఇప్పటికే ఈ జాబితాను ఆదాయపన్ను శాఖకు పంపించగా, వారెవరూ పన్ను చెల్లించడం లేదన్న జవాబు రావడంతో ఇక వారిని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల బినామీలుగానే అనుమానించక తప్పదంటున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడి.. ఈ భూములు అమ్మిన వారి నుంచి విచారణ ప్రారంభించింది. అందుకే, ఈ కొనుగోళ్లకు సంబంధించి కేసు నమోదు చేసేందుకు తగిన రంగాన్ని వైసీపీ సర్కారు సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా రాజధాని భూముల కోనుగోళ్ల వ్యవహారంలో నారాయణ కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు చాలాకాలం నుంచీ ఉన్న విషయం తెలిసిందే. ఇంకా మరికొద్దిమంది టిడిపి ప్రముఖుల పేర్లు కూడా సీఐడి విచారణలో బయటకు తీసుకురావడం ద్వారా, టిడిపిని ఇరుకున్న పెట్టడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: