ఓ మనిషి నిర్లక్ష్యం మరో నిండు ప్రాణం బలైపోతున్న రోజులివి. జాగ్రత్తలు పాటించకపోవడం, అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి కారణాలతో రోజూ అనేకమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు కొందరు. అటువంటి నిర్లక్ష్యమే ఓ అమాయక చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో ప్రాంతంతో జరిగిన ఈ దారుణం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

 

 

మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ కు చెందిన తరుణ్(5) అనే బాలుడు ఈ ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అక్కడే ఓ వ్యక్తి తన కారును రివర్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో వెనుక ఉన్న బాలుడిని కారు డ్రైవర్ గుర్తించలేదు. దీంతో కారు వెనుక చక్రాలు ఆ బాలుడిపై నుంచి వెళ్లిపోయాయి. దీంతో బాలుడు పెట్టిన కేకలు విన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన తరుణ్ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. ఈ ఉదంతం చూపరులను, చుట్టుపక్కలవారిని కలచివేసింది. వెంటనే సమాచారం అందుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తరుణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా కొంతమందిలో నిర్లక్ష్యం పోవడం లేదు. దీంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, డ్రైవింగ్ పై పట్టు లేకపోవడంతో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. డ్రైవింగ్ పై నియంత్రణ లేకపోవడం, మెళకువలు తెలియకపోవడంతో ఎదుటి వారి ప్రాణాలు పోతున్నాయి. ఆకతాయితనంగా కూడా కొందరు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: