ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత లాగ తయారైంది బిజెపి పరిస్ధితి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు కమలం పార్టీ నేతలు విలవిల్లాడి పోతున్నారు.  నేతల్లో రోజు రోజకు టెన్షన్ పెరిగిపోతోంది. అసెంబ్లీలో పాసైన రెండు బిల్లులను మంగళ, బుధవారాల్లో శాసనమండలిలో టిడిపి ఎంత కంపు చేసిందో అందరూ చూసిందే.  మండలి ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని జగన్ను గబ్బు పట్టించి తన కసి తీర్చుకుందామని అనుకున్నాడు చంద్రబాబునాయుడు.

 

అనుకున్నట్లే ప్రయత్నం కూడా చేశాడు కానీ అంతిమంగా అప్రదిష్ట మూటగట్టుకున్నది మాత్రం చంద్రబాబే అని తేలిపోయింది. చంద్రబాబు చెప్పినట్లే బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు  పంపుతున్నట్లు ప్రకటించేసిన  మండలి ఛైర్మన్ షరీఫ్ అదే ప్రకటనలో తాను తప్పు చేస్తున్నట్లు అంగీకరించటంతో టిడిపి డిఫెన్స్ లో పడిపోయింది. అంటే జగన్ను ఇబ్బంది పెట్టటానికే  చంద్రబాబు మండలి ఛైర్మన్ ను ఉపయోగించుకున్నారనే ప్రచారం పెరిగిపోయింది.

 

దానికి తోడు షరీఫ్ ప్రకటన చేసే సమయానికి చంద్రబాబు మండలి గ్యాలరీకి వచ్చి కూర్చోవటం మరింత డ్యామేజయిపోయింది. సరే బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసినా అసలు ఈ కంపు మొత్తానికి మండలి ఉండటమే కారణమని జగన్ అభిప్రాయానికి వచ్చేశారు. దాంతో మండలి రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా చేయటం, మెజారిటి సభ్యులు అసెంబ్లీలో ఆమోదం తెలపటం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై సోమవారం అసెంబ్లీలో చర్చ కూడా జరగబోతోంది.

 

ఇక్కడే బిజెపికి సమస్య మొదలైపోయింది.  ప్రస్తుత మండలిలో బిజెపికి ఇద్దరు సభ్యులున్నారు. రాష్ట్రం మొత్తం మీద  పార్టి తరపున ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా  అంటే వీళ్ళిద్దరే. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున 175 ఎంఎల్ఏలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటి చేసినా ఒక్కదానిలో కూడా గెలవలేదు. అసలు డిపాజిట్లు తెచ్చుకున్న నేతలు  దాదాపు లేరనే చెప్పాలి.   ఈ పరిస్ధితుల్లో  మండలి కనుక రద్దయితే ఉన్న ఇద్దరి సభ్యత్వాలు ఊడిపోతాయి. అందుకే మండలి రద్దు కాకూడదని కోరుకుంటున్నారట. చూద్దాం ఏం జరుగబోతోందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: