తమిళనాడులో విగ్ర‌హాల రాజ‌కీయం కొన‌సాగుతోంది. 1971లో సేలంలో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను నగ్నంగా, వాటి మెడలో చెప్పుల దండలేసి ఊరేగించారని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 14న తుగ్లక్‌ పత్రిక గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ పెరియార్‌పై చేసిన ఈ వ్యాఖ్య‌లు వివాదాన్ని రేకెత్తించాయి. అయితే, తాజాగా మ‌ళ్లీ అదే రాష్ట్రంలో ప్రతిష్టించిన పెరియార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు.

 


తమిళనాడు చెంగల్పేట్‌ జిల్లాలోని కలియపట్టాయి గ్రామంలో విగ్ర‌హం ధ్వంస‌మైంది. ధ్వంసమైన పెరియార్‌ విగ్రహాన్ని చూసి గ్రామస్తులు షాక్‌ అయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కలియపట్టాయి గ్రామానికి చేరుకున్నారు. పెరియార్‌ విగ్రహం కుడి చేయి, ముఖాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

కాగా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల రజనీకాంత్‌ క్షమాపణ చెప్పాలని డీఎంకే నాయకుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ద్రవిడార్‌ విదుతలై కజగమ్‌ నేతలు ఇప్పటికే నల్లచొక్కాలు ధరించి రజనీకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పేది లేదని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తాను చదివిని, విన్న అంశాల ఆధారంగానే మాట్లాడనని రజనీ చెప్పారు. అంతేగానీ ఊహజనిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎవరైనా తన నుంచి క్షమాపణలు ఆశిస్తే.. తాను క్షమించమని కోరలేను అని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. మ‌రోవైపు, రజనీ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు పోలీసులు ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లో రజనీకాంత్‌ ఇంటి వద్ద 50 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. రాఘవేంద్ర ఎవెన్యూకు సమీపంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఎవరైనా రజనీకాంత్‌ను కలవాలనుకుంటూ పూర్తిగా విచారించిన తర్వాతే అనుమతిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: