ఈరోజు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తరువాత బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. 2,169 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కొరకు 134 కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొననున్నారు. 
 
పది గంటలకు తొలి ఫలితం వెలువడనుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల్లో ఆ పార్టీకే స్పష్టమైన ఆధిక్యత వస్తుందనే విశ్వాసం ఉంది. సర్వేలు కూడా ఫలితాలు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఆధిక్యత వస్తుందని చెబుతున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కారు జోరు చూపిస్తోంది. హైదరాబాద్ శివార్లలో, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటోంది. 
 
హైదరాబాద్ శివార్లలో, నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ఆధిక్యంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పరువును నిలుపుకుంటోంది. పురపాలిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆలగిరి చిత్ర డివిజన్ లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. రాజన్న సిరిసిల్ల కార్పొరేషన్ పరిధిలోని 40 డివిజన్లలో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ పార్టీ 4 చోట్ల విజయం సాధించింది. 
 
ఈ నెల 22వ తేదీన జరిగిన ఎన్నికల్లో పురపాలక సంఘాల్లో దాదాపు 30 లక్షల మంది, నగర పాలక సంస్థల్లో దాదాపు 8 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 80 మంది వార్డు సభ్యులు, ఒక కార్పొరేటర్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈరోజు మధ్యాహ్నానికి దాదాపుగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: