తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నెల 22న ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపులో భాగంగా...బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయిన మున్సిపల్‌ అభ్యర్థుల భవితవ్యం వెల్ల‌డ‌వుతోంది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తిచేయడానికి పురపాలకశాఖతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 8,894 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి, పురపాలకశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవితో కలిసి మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. 

 


ఈ నెల 27న మేయర్‌, చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి వివరించారు. ఈ ఎన్నిక నిర్వహణకోసం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జిల్లా కలెక్టర్లు ఒక గెజిటెడ్‌ అధికారిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారని తెలిపారు. వారు ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులకు, ఎక్స్‌అఫీషియో అభ్యర్థులకు మేయర్‌, చైర్‌పర్సన్ల ఎంపిక సమావేశానికి హాజరు కావాలని నోటీస్‌లు ఇస్తారని చెప్పారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపిక కోసం గుర్తింపుపొందిన రాజకీయపార్టీలు ఎన్నికకు ఒకరోజు ముందుగా ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ఫామ్‌- ఏ, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్ల పేర్లను తెలుపుతూ ఎన్నిక జరిగే రోజు ఉదయం 10 గంటలకు ఫామ్‌-బీని ప్రిసైడింగ్‌ అధికారికి అందించాల్సి ఉంటుందన్నారు. ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు విప్‌లను నియమించుకోవచ్చునని తెలిపారు. విప్‌ల నియమానికి సంబంధించి ఫామ్‌-1,ఫామ్‌ 2, ఫామ్‌ 3 ల ద్వారా తెలియజేయాలని చెప్పారు. 

 


మేయర్‌, చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా స్పెషల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల నియమావళి ఈనెల 25 నుంచి అమలులోకి వస్తుందని నాగిరెడ్డి వివరించారు. ఈ సమయంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు పోటీ చేసేవారుగానీ, రాజకీయపార్టీలు గానీ ఓట్లకోసం పదవులు ఇస్తామంటూ ఎలాంటి హామీ ఇవ్వకూడదని చెప్పారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈసారి గత ఎన్నికలకంటే పోలింగ్‌శాతం తగ్గిందని వివరించారు. మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటుహక్కు ఉంటుందని పురపాలకశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: