తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటినుండి టీఆర్‌ఎస్‌ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తెలంగాణ భవన్ కు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని తెలంగాణ భవన్ నుండి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. ఈరోజు ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. 
 
టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఈ ఎన్నికల్లో కారు జోరు చూపిస్తూ ఉండటంతో విజయం కేటీఆర్ దే అని కేటీఆర్ మంత్రాన్ని జపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయానికి కేటీఆరే కారణమని చెప్పకనే చెబుతున్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ మంత్రం జపించడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది. టీఆర్ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక బలంగా ఉంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేటీఆర్ మంత్రిగా పని చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. 2018 ఎన్నికల ఫలితాల తరువాత కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించగా ఆ పదవిని కూడా కేటీఆర్ సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తరువాత కేసీఆర్ కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమల శాఖ బాధ్యతలను అప్పగించారు. 
 
ఇప్పటికే కేటీఆర్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారని స్పందన వ్యక్తం చేసినా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మాత్రం కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ హవా చూపిస్తూ ఉండటంతో అతి త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: