తెలంగాణాలో జరిగిన  మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. కారు జోరుకు మిగిలిన ప్రతిపక్షాలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటిల్లో టిఆర్ఎస్ 81 చోట్లు మంచి మెజారిటితో దూసుకపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  కాంగ్రెస్, బిజెపిలు ఏ దశలో కూడా టిఆర్ఎస్ కు గట్టి పోటిని కూడా ఇవ్వలేకపోయాయి. సరే కేసియార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటియార్ చెప్పినట్లుగానే  అన్నీ పార్టీలూ కారు  చక్రాల కింద నలిగిపోయాయనే   చెప్పాలి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిదేమో అధికార టిఆర్ఎస్ చాలా బలంగా ఉండటం. రెండోదేమో ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉండటం. పైగా రకరకాల కారణాలతో ప్రతిపక్షాలు వేటికవే పోటి చేయటంతో అధికారపార్టికి ఎదురు లేకుండాపోయింది.  సరే బిజెపిని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్నట్లే ఇపుడు కూడా వర్గ రాజకీయాలే కొంప ముంచాయనే చెప్పాలి.

 

ప్రతిపక్షంలో కూర్చున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదని అర్ధమైపోయింది. నిజానికి టిఆర్ఎస్ పాలనపై జనాల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అయితే దాన్ని అవకాశంగా తీసుకుని జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళగలిగే నాయకత్వం కాంగ్రెస్ లో కనిపించటం లేదు. కేసియార్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లో పలానా నాయకుడు ఉన్నాడని జనాలకు నమ్మకం కలిగేంత వరకూ  ఎన్నికేదైనా విజయం మాత్రం టిఆర్ఎస్ దే అనటంలో సందేహం లేదు.

 

మరి కాంగ్రెస్ లో ఆ పరిస్ధితి ఎప్పుడొస్తుందంటే అనుమానమే. ఎందుకంటే ఏ నాయకుడు ముందుకెళ్ళాలని ప్రయత్నించినా మిగిలిన వాళ్ళు వెనక్కు లాగేస్తారు. లేకపోతే ముందుకు వెళ్ళనీయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. రేవంత్ రెడ్డి లాంటి యువనేతలకు కేసియార్ నాయకత్వానికి  సవాలు విసరగల సామర్ధ్యం  ఉన్నప్పటికీ విహెచ్, పొన్నాల లాంటి అనేకమంది సీనియర్ నేతలు అడ్డు తగులుతున్నారు. వీళ్ళకి సామర్ధ్యం లేదు. ఉన్నవాళ్ళని ఎదగనీయరు.

 

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్ధుల ఎంపికలో జరిగిందిదే. గ్రూపు తగాదాలతో కొట్టుకుని చివరకు టిఆర్ఎస్ ఆధిక్యానికి మార్గం చూపించారు. గ్రూపులు టిఆర్ఎస్ లో కూడా ఉన్నా బలమైన ఏక నాయకత్వం ముందు అసంతృప్తుల ప్రభావం పెద్దగా కనబడలేదు. ఇక బిజెపి అంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే అసలు సమస్య. మిగిలిన పార్టీలు అసలు సోదిలోకి కూడా కనబడలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: