మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార టీఆరెస్ హవా స్పష్టంగా కన్పించింది . నల్గొండ , భువనగిరి యాదాద్రి , సూర్యాపేట జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో అధికార టీఆరెస్ పాగావేసింది . కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు గతం లో  ప్రాతినిధ్యం వహించిన  హుజూర్ నగర్ , నాగార్జున సాగర్ , నల్గొండ  అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పుర ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది .

 

హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం టీఆరెస్ అత్యధిక వార్డులు గెల్చుకున్నట్లు తెలుస్తోంది . ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోను  ఇదే పరిస్థితి కన్పిస్తుండగా , నల్గొండ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కన్పిస్తోంది . ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీ లో అధికార పార్టీ అత్యధిక స్థానాలు సాధించి చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి .

 

మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట పట్టణ ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టేందుకు ఆసక్తి చూపించినట్లు కన్పిస్తోంది .  సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ప్రకటించిన వార్డుల్లో అత్యధిక స్థానాల్లో టీఆరెస్ తరుపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచారు.  భువనగిరి యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట లో కాంగ్రెస్ విజయం సాధించగా , భువనగిరి లో టీఆరెస్ అత్యధిక స్థానాలు గెల్చుకుంది .  భువనగిరి మున్సిపాలిటీ లో అధికార పార్టీ కి కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది . పోచంపల్లి మున్సిపాలిటీ లో టీఆరెస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది .   ఇక  కోదాడ , చిట్యాల , మిర్యాలగూడ,  మున్సిపాలిటీలను అధికార టీఆరెస్ ఖాతాలో చేరనున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: