దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా...లేక జగనోకసి, అంటే జగన్‌ కసిలోఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవాసులపై కసి తీర్చుకోవడానికే జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అధికారంలోకి రావడానికి ఒక్కఛాన్సంటూ బతిమాలి, వరమిచ్చిన ప్రజలపై, రాష్ట్రంపై తన భస్మాసుర హస్తాన్ని పెట్టాలని చూస్తున్నాడని, ఆయన బారినుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. 

మండలి రద్దు, పునరు ద్ధరణ అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండవన్న యనమల, అసెంబ్లీలో ఆర్టికల్‌-169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. అసెంబ్లీ పంపిన తీర్మానంపై కేంద్రం బిల్లుని తయారుచేసి లోక్‌సభకు పంపుతుందని, తరువాత అది రాజ్యసభకు, రాష్ట్రపతి ముందుకు వెళుతుందన్నారు. ఆర్టికల్‌ 174-2 (బీ) కింద అసెంబ్లీని రద్దుచేసే అధికారం గవర్నర్‌కు ఉందని, ప్రజల ఆలోచనలకు వ్యతిరేంగా వెళుతోన్న ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉందన్నారు. 

ప్రభుత్వం మండలిని రద్దుచేస్తే, గవర్నర్‌ అసెంబ్లీని రద్దుచేయడంద్వారా ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరిపక్షమో తేలుతుం దని యనమల స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించే అధికారం రాష్ట్రాలకు ఉండబోదని, పీపీఏల విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్లిన ప్రభుత్వా నికి ఎలాంటిపరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసునన్నారు. ఆర్టికల్‌-257ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని,  కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే, ఆర్టికల్‌-356కింద చర్యలు తీసుకునే అధికారం కూడా వారికి ఉందన్నారు.  బిల్లుని సెలెక్ట్‌ కమిటీకి పంపేవిషయంలో, తనకున్న విచక్షణాధికారంతో ఛైర్మన్‌  నిర్ణయం తీసుకున్నాడని, ఆయన అధికారాలను ప్రశ్నించేహక్కు ఎవరికీ ఉండదని, ఛైర్మన్‌ న్యాయబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాడని యనమల తెలిపారు.  

 

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేయడం, కౌన్సిల్‌ తిరస్కరించడం, శాఖల తరలింపుని హైకోర్టు తప్పపట్టడం జరిగినా కూడా సాక్షి మీడియాలో ఇంకా తప్పుడువాదనలు చేస్తూనే ఉన్నారని మాజీమంత్రి మండిపడ్డారు. బిల్లుని సెలెక్ట్‌కమిటీకి పంపలేదని రాయడం, బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న జగన్‌ సొంతమీడియాకే చెల్లిందన్నారు.  బుర్రలేనిమంత్రులంతా అసెంబ్లీలో గంటలో ఆమోదించిన బిల్లుని మండలి గుడ్డిగా ఆమోదించాలా అని రామకృష్ణుడు ప్రశ్నించారు.  సెలెక్ట్‌కమిటీలో 9 నుంచి 15మంది సభ్యులుంటారని, వారంతా ప్రజాభిప్రాయాలు తీసుకుంటారని, అందుకు అవసరమైన కాలవ్యవధిని మండలే నిర్ణయిస్తుందని యనమల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: