మున్సిపోల్స్ లో కాంగ్రెస్ కుదేలయింది .  మెజార్టీ పురపాలికల్లో అధికార పార్టీకి, కాంగ్రెస్ ఎక్కడాకూడా  గట్టి పోటీ ఇవ్వలేక చతికిలపడింది . పురపోరు లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా ?, లేకపోతే ఆయన్నేఅధిష్టానం ఇంకా  అధ్యక్షునిగా కొనసాగిస్తుందా  ?? అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో తలెత్తుతోంది . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి ఘోర ఓటమి తరువాత ఆయన్ని అధ్యక్ష  పదవి నుంచి తప్పించనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి .

 

అయితే అధ్యక్ష పదవి మార్పు పై అధిష్టానం ఆచితూచి అడుగులు వేయడం తో , మున్సిపోల్స్ కు కూడా కాంగ్రెస్,  ఉత్తమ్ నేతృత్వంలోనే వెళ్లి చావుదెబ్బ తిన్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి . టీపీసీసీ అధ్యక్ష పదవిని పార్టీలోని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు . ప్రస్తుతం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొనసాగుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తోపాటు , భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీధర్ బాబు తోపాటు సీఎల్పీ నేతగా  మల్లు భట్టి విక్రమార్క లు పోటీలో ఉన్నారు . ఇక జగ్గారెడ్డి తోపాటు  వీహెచ్ లాంటి సీనియర్లు కూడా తాము రేసులో ఉన్నామని చెబుతున్నారు . మున్సిపోల్స్ లో ఘోర ఓటమి తరువాత పార్టీ బలోపేతానికి , టీపీసీసీ ప్రక్షాళన చేయాల్సిందేనని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు .

 

టీపీసీసీ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉత్తమ్ ను తప్పించి , కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది .  అయితే ఎవరికీ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా , మిగిలిన నేతలు గ్రూప్ రాజకీయం నెరిపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి . అందుకే పార్టీ అధిష్టానం కూడా అధ్యక్షుని మార్పుపై సందిగ్ధావస్థ లో ఉన్నట్లు చెబుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: