తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఏ పార్టీ కి స్పష్టమైన ఆధిక్యత లభించలేదు . ఆయా  మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ ఎక్స్ అఫిషియో అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తుండగా , పలు మున్సిపాలిటీల్లో మాత్రం ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు . మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రెండు మున్సిపాలిటీలను కోల్పోయిన టీఆరెస్  , రెండు కార్పొరేషన్లను దక్కించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది .  

 

నగర శివారు  బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 32 డివిజన్లకుగాను అధికార టీఆరెస్ కు 13 డివిజన్లను గెల్చుకోగా , బీజేపీ 10 డివిజన్లను కైవసం చేసుకుంది . ఇక కాంగ్రెస్ పార్టీ ఏడు , ఇండిపెండెంట్లు రెండు డివిజన్లలో విజయం సాధించారు . మేయర్ పీఠాన్ని గెల్చుకునేందుకు టీఆరెస్ కు మరో ముగ్గురు మద్దతు అవసరం ఉండగా , ఇద్దరు ఇండిపెండెంట్ల తోపాటు కాంగ్రెస్ కు చెందిన ఒక సభ్యున్ని తమవైపు తిప్పుకోవాలని పథకరచన చేస్తున్నట్లు తెలుస్తోంది . అయితే ఇండిపెండెంట్లు , కాంగ్రెస్ సభ్యులను తమవైపు తిప్పుకోవడం కుదరకపోతే , ఎక్స్ అఫిషియో అస్త్రాన్ని ప్రయోగించే అవకాశాలున్నాయి .

 

ఇక మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 46 డివిజన్లకుగాను  టీఆరెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెల్చుకుంది . మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో నలుగురైదుగురి మద్దతు అవసరం . ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఒకే నియోజకవర్గం లో ఉండడం తో ఏదో  ఒక మున్సిపాలిటీ లో మాత్రమే ఎక్స్ అఫిషియో అస్త్రం పనిచేయనుండగా , మరొక మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు . దీనితో   బడంగ్ పేట , మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇండిపెండెంట్లుగా గెల్చిన వారిని తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: