బడంగ్  పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార టీఆరెస్ కు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ , కాంగ్రెస్ లు పథకరచన చేస్తున్నాయా ? అంటే అవుననే తెలుస్తోంది . బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 32 స్థానాలుండగా అధికార టీఆరెస్ 13 స్థానాల్లో విజయం సాధించగా , బీజేపీ పది , కాంగ్రెస్ ఏడు  స్థానాలను గెల్చుకుంది . ఇక ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో సత్తా చాటారు  . టీఆరెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం కావడంతో ఇండిపెండెంట్ల తోపాటు , కాంగ్రెస్ సభ్యులపై గురిపెట్టినట్లు తెలుస్తోంది .

 

అదే సమయం లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం . ఈ రెండు పార్టీలు కలిస్తే, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న  అధికార పార్టీ  ఆశలు గల్లంతు కావడం ఖాయంగా కన్పిస్తోంది . మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్  ఎమ్మెల్యే గా విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యం లో టీఆరెస్ లో చేరి,  కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు . మంత్రి వైఖరి పట్ల ఆగ్రహంగా ఉన్న స్థానిక కాంగ్రెస్ నేతలు , బీజేపీ తో కలిసి మేయర్ పీఠాన్ని పంచుకునేందుకు ఆ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో రెండు మున్సిపాలిటీ లో అధికార పార్టీ చేజారాయి .

 

తుక్కుగూడ మున్సిపాలిటీ లో బీజేపీ విజయం సాధించగా , జల్ పల్లి మున్సిపాలిటీ ని ఎంఐఎం కైవసం చేసుకుంది . ఇక ఇప్పడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మైత్రి కుదిరిందంటే బడంగ్ పేట కూడా చేజారడం ఖాయంగా కన్పిస్తోంది . చూడాలి ..  మరి బీజేపీ , కాంగ్రెస్ లు కలిసి టీఆరెస్ కు ఝలక్ ఇస్తాయా ?, లేకపోతే మేయర్ పీఠాన్ని ఆ పార్టీ కి అప్పగిస్తాయా ?? అన్నది హాట్ టాఫిక్ గా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: