తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితం విడుద‌ల అవ‌డం...అందులో కారు జోరు కొన‌సాగ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, నేడు ఇంకో కీల‌క కార్పొరేష‌న్‌లో ఫ‌లితం రానుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై కోర్టు తీర్పుతో ఎట్ట‌కేల‌కు పుర‌పోరులో నిలిచిన క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌లో నేడు ఫ‌లితం రానుంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. కౌంటింగ్ కు సంబంధించి ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశముంది.

 

2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ గెలవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే టెన్షన్ అంతటా నెలకొంది. కార్పొరేషన్లో కాంగ్రెస్ పోటీ చేసినా ప్రధాన పోటీ టీఆర్ఎస్ , బీజేపీ మధ్యే ఉంటుందనే అంచనాలున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా 2 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లో 58 డివిజన్లలో 62.52 % పోలింగ్ శాతం నమోదైంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2 లక్షల 64 వేల 134 మంది ఓటర్లుండగా….లక్షా 65 వేల 147 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 58 డివిజన్లకు సంబంధించి కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 3 రౌండ్ల లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 58 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను నియమించారు. వీరికి ఒక్కొక్కరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశారు.

 

కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా డివిజన్ల వారిగా పోస్టల్ బ్యాలెట్ల్ ను లెక్కించనున్నారు. అన్ని డివిజన్లలో కలిపి 500 లకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనునన్నారు. 25 ఓట్లకు ఒక కట్ట కట్టి… రౌండుకు వెయ్యి ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కు పోటీ చేసిన అభ్యర్థి కానీ వారి తరపున ఏజెంట్ ను ఒక్కరినే కౌంటింగ్ హాల్ లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.  మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేయనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: