ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువనాయకత్వం పుష్కలంగా ఉన్న పార్టీ ఏదంటే? అధికార వైసీపీ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఆ పార్టీకి అధిక స్థాయిలో యువ నేతలు ఉన్నారు. అయితే వారు పేరుకు మాత్రమే కాకుండా..పార్టీ కోసం బాగా కష్టపడటంలోనూ ముందున్నారు. ప్రతి విషయంలోనూ పార్టీకు అండగా నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ యంగ్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు కొందరు దుమ్ములేపుతున్నారనే చెప్పొచ్చు.  అలా పార్టీ కోసం అండగా ఉంటూ...ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్న నేతల్లో ముందు వరుసలో ఉంది అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.

 

2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి మంచి మెజారిటీతో గెలిచి...అసెంబ్లీలో అడుగుపెట్టిన అమర్నాథ్ అడుగడుగున ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో తమ ఉత్తరాంధ్ర కష్టాలని చెబుతూనే, అమరావతికి మద్ధతు తెలుపుతున్న ప్రతిపక్ష టీడీపీ తీరుని ఎండగడుతున్నారు. అసెంబ్లీలో కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ...ప్రజలకు బాగా నోటెడ్ పర్సన్ అయ్యారు. ఇక అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అప్పలరాజు...మొన్న ఎన్నికల్లో పలాస నుంచి 16 వేల మెజారిటీతో గెలిచి...తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. బాగా కూల్‌గానే ప్రతిపక్షానికి చురకలు అంటిస్తూ దూసుకెళుతున్నారు. వయసులో చిన్నవాడైన..40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు చెమట పట్టిస్తున్నారు.

 

ఇటు ఈస్ట్ గోదావరిలో రాజానగరం నుంచి తొలిసారి గెలిచిన జక్కంపూడి రాజా కూడా ఓ ఫైర్ బ్రాండ్‌లా పేలుతూ...టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. అటు వెస్ట్ గోదావరి దెందులూరు టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌ని చిత్తు చేసిన అబ్బయ్య చౌదరీ కూడా తనదైన శైలిలో డిబేట్లలో గానీ, అసెంబ్లీలో గానీ టీడీపీపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ కొత్తైన ఏ మాత్రం తడబడకుండా అనుకున్న విషయాన్ని సూటిగా చెబుతున్నారు. రాయలసీమ విషయానికొస్తే...అనంతపురం రాప్తాడులో పరిటాల కుటుంబానికి చెక్ పెట్టిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  కూడా అతి తక్కువ కాలంలోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఓ  వైపు ప్రభుత్వానికి అండగా ఉంటూనే...ప్రతిపక్ష టీడీపీ విమర్శలని తిప్పికొడుతూ అదరగొడుతున్నారు. మొత్తం మీద ఈ యంగ్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు వైసీపీలో అరడగొడుతున్నారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: