శాసన మండలిని  రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసింది . తీర్మానాన్ని పార్లమెంట్ కు నివేదించనుంది . పార్లమెంట్ ఆమోదించిన తరువాత రాష్ట్రపతి కి పంపడం , ఆ తరువాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల ద్వారా శాసన మండలి రద్దు కానుంది . అయితే శాసన మండలి రద్దు వల్ల నష్టం ఎవరికన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది . శాసనమండలిలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ కి సంపూర్ణ మెజార్టీ ఉండగా , ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి క్రమేపీ మెజార్టీ లభించనుంది .

 

శాసనమండలి రద్దు వల్ల తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయినా ,దీర్ఘకాలంగా మాత్రం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకే నష్టమన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఎన్నికల ముందు పార్టీ టికెట్లు లభించని ఎంతోమంది నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తానని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు  గుర్తు చేస్తున్నారు . పార్టీ ఆవిర్భవించిన తొమ్మిదేళ్ల నుంచి అంకితభావంతో పనిచేస్తోన్న నాయకులకు కూడా ఇదే తరహా హామీని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని పేర్కొంటున్నారు . ఇప్పుడు మండలి రద్దు ద్వారా జగన్మోహన్ రెడ్డి వారికి ఎలా అవకాశం కల్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు .

 

ఇక మండలి రద్దు ద్వారా ప్రస్తుతం వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న తొమ్మిది మంది రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది హాట్ టాఫిక్ గా మారింది .  ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం . అయితే మండలి రద్దు ఆ మంత్రులిద్దరు జైకొట్టడం చూస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి వారి రాజకీయ భవిష్యత్తుకు గట్టి భరోసానే ఇచ్చినట్లు తెలుస్తోంది .  ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నవారికి నామినేటెడ్  పదవులు కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: