ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం ... దాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తో రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు పురుడుపోసుకునే ప్రమాదాలు లేకపోలేదన్న సంకేతాలు విన్పిస్తున్నాయి . అయితే ఈ ప్రాంతీయ ఉద్యమ నాదాన్ని విన్పిస్తున్న వారికి  ప్రజామద్దతు ఎంత ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది . ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో కేసీఆర్ వెన్నంటి నడిచింది గుప్పెడు మందేనన్న విషయాన్ని విస్మరించవద్దు .

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత పరిపాలన వికేంద్రీకరణ కు మొగ్గు చూపింది . దానిలో భాగంగానే మూడు ప్రాంతాల్లో శాసన, పరిపాలన, న్యాయ రాజధానులను అమరావతి , విశాఖ పట్నం , కర్నూల్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది . ఈ మేరకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది . అయితే మండలి మాత్రం ఈ బిల్లు ని సెలెక్ట్ కమిటీ కి పంపి  ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించింది . దానికి కారణం లేకపోలేదు . మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ తీవ్రంగా  వ్యతిరేకిస్తోంది . అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ పార్టీ నాయకత్వం పట్టు బడుతోంది .

 

మండలిలో ఆ పార్టీ కి బలం ఉండడంతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ కి  పంపే విధంగా ఆ పార్టీ నాయకత్వం ... చైర్మన్ పై  ఒత్తిడి చేసిందన్న ఆరోపణలున్నాయి . అయితే మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ  వ్యతిరేకించడం పట్ల  సీమ నేతలు మిశ్రమంగా స్పందిస్తుండగా , తొలిసారిగా ఉత్తరాంధ్ర నేతలు మాత్రం ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని  తెర పైకి తీసుకు రావడం హాట్ టాఫిక్ గా మారింది . ప్రస్తుతానికి ఈ వాదాన్ని వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్నదొర ఒక్కరే విన్పిస్తున్న , భవిష్యత్తు లో మరికొంతమంది గళం కలిపే అవకాశాలు కన్పిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: