కొద్ది గంటల క్రితం విజయవాడలో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంచలనానికి తెర లేపిన వారి పొత్తు తర్వాత సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. జనసేన నుండి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, శివ శంకర్ ఇందులో పాల్గొనగా బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి లు హాజరయ్యారు.

 

ఇకపోతే ప్రధానంగా వీరు రాబోయే స్థానిక ఎన్నికల ప్రక్రియ పై చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఇందుకు క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇరు పార్టీల ఆమోదంతో కమిటీ సభ్యుల ఎంపిక ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పని చేయని వారిని పక్కన పెట్టాలని నిర్ణయించారు.

 

మరోవైపు సమావేశంలో ప్రధానంగా రాజధానిగా అమరావతి కొనసాగించాలని అంశంపై చర్చ జరిగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల దగ్గరకు వెళ్లివారితో మాట్లాడి ఓదార్చాలని ఇందుకు బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి. రాజధాని తరలింపునకు సంబంధించి కేంద్రం అనుమతి ఉందని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందనే అభిప్రాయానికి వచ్చారు. అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని కమిటీ మండిపడింది.

 

అయితే జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన చేపట్టబోతున్న కవాతుపై నిర్ణయం తీసుకోకుండానే జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ భేటీ ముగియడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: