శాసనమండలి  రద్దు తీర్మానం విషయంలో రాష్ట్రంలోని చాలా మంది నేతలు ఇపుడు  ఒక్కరిపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది.  ఆ ఒక్క నేతే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వెంకయ్యది నెల్లూరు జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి నుండి కమలంపార్టీలోనే ఉన్నా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఎలాగూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా సన్నిహితుడనే చెప్పాలి.

 

చంద్రబాబు, పవన్ కు కామన్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతే అన్నది వాస్తవం. తాజా రాజకీయ పరిస్ధితుల్లో శాసనమండలిని రద్దు చేస్తు అధికారపార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  అనుకుంటే చాలు వెంటనే   ఉభయసభల్లో  అసెబ్లీ రద్దు తీర్మానం అంశంపై ఓటింగ్ జరుగుతుంది. తర్వాత ఆ తీర్మానంపై  రాష్ట్రపతి సంతకం అయిన తర్వాతే మండలి రద్దయినట్లు లెక్క.

 

అంటే మండలి తీర్మానం రద్దు తీర్మానం చేయటం వరకే జగన్ కు అధికారం. ఆ తర్వాతంతా కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇక్కడే చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అనుమానంగా ఉంది. ఎలాగంటే కేంద్రంలో చంద్రబాబును దగ్గర చేర్చే వాళ్ళల్లో వెంకయ్య తప్ప మరొకరు కనబడటం లేదు. చంద్రబాబుకు మద్దతుగా వెంకయ్య గనుక ఈ దశలో జోక్యం చేసుకుని అమిత్ షా తో మాట్లాడితే  తీర్మానం బిల్లు కోల్డ్ స్టోరేజిలో పడిపోవటం ఖాయమే.

 

జగన్ మాట చెల్లుబాటైతే  పార్లమెంటులో తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. అదే చంద్రబాబు ప్రయత్నాలు విజయవంతమైతే తీర్మానం ప్రవేశపెట్టటమే ఆలస్యమవుతుంది. వెంకయ్య ఆదుకుంటాడన్న నమ్మకంతోనే ఏమో మండలి రద్దుకు కనీసం మూడేళ్ళు పడుతుందని చంద్రబాబు, యనమల లాంటి వాళ్ళు పదే పదే చెబుతున్నది. అంటే ఈయనేమన్నా చేయాలని అనుకున్నా తెరవెనుక నుండే చేయాలి లేండి. అందుకనే వెంకయ్య విషయంలో అందరిలోను టెన్షన్ మొదలైంది.

 

మండలి రద్దుకు వ్యతిరేకంగా పవన్ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇపుడెలగూ బిజెపి మిత్రపక్షమే కాబట్టి ఏదో రూపంలో వెంకయ్యను కలిసి మండలి బిల్లును ఆలస్యం చేయమని అడిగే అవకాశం ఉంది. ఎలాగూ మండలి రద్దయితే బిజెపి ఇద్దరు సభ్యులు కూడా మాజీలవుతారు. కాబట్టి ఈ యాంగిల్ లో కూడా వెంకయ్యను జోక్యం చేసుకోమని వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మండలి రద్దు కాకుండా అడ్డుకునే విషయంలో చాలామంది నేతలు వెంకయ్య పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: