ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల స‌ల‌హాలు ఇస్తూ, వాటి ర‌థ‌సార‌థుల‌ను ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిస్తున్న పీకేకు...రాజ‌కీయంలో ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌స్తుతం పీకే బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్‌ (యూ) పార్టీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్ పీకేకే పార్టీ ఉపాధ్యక్షుడి హోదా క‌ల్పించారు. అయితే, తాజాగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు స్ప‌ష్టం అయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) తమ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతూ తరుచూ విమర్శలు చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌పై తొలిసారి బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నోరు విప్పారు. ‘ఆయన (ప్రశాంత్‌ కిషోర్‌) పార్టీలో ఉన్నా మంచిదే. పార్టీ నుంచి వెళ్లిపోయినా మంచిదే’ అని తేల్చిచెప్పారు. 

 

పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు జేడీయూ మద్దతు తెలిపింది. అయితే, దీన్ని ప్రశాంత్‌ కిషోర్‌ తప్పుబట్టారు. అయితే ఈనెల 10 నుంచి సీఏఏ అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయడం.. ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ త‌ర‌ఫున‌ సీఏఏను బీహార్‌లో అమలు చేయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఇది ఈ ఇద్ద‌రి మ‌ధ్య విబేధాల‌కు కార‌ణంగా మారిందంటున్నారు. కాగా, పార్టీ నేతలతో సమావేశం అనంతరం నితీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రశాంత్‌ జేడీయూలో కొనసాగాలనుకుంటే తొలుత పార్టీ సిద్ధాంతాలను ఒంటబట్టించుకోవాలి’ అని  హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచన మేరకే ప్రశాంత్‌కిశోర్‌ను జేడీయూలో చేర్చుకున్నామన్నారు.

 

అయితే, దీనిపై ప్రశాంత్‌కిశోర్‌ తీవ్రంగా స్పందించారు. పార్టీలో తన చేరికపై అబద్ధ్దాలు చెప్పేందుకు నితీశ్‌ ఎంతగానో దిగజారిపోయారని, ఆయనలా తన రంగును కూడా మార్చేందుకు విఫల ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మ‌రోవైపు,  సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో నిర్ణయం తీసుకున్నందుకు ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలకు ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. సీఏఏపై ప్రారంభంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి తెలియజేయనందుకు రాహుల్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: