మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గా తయారయింది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నిటితో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకున్నా ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఇప్పటికీ ఆ బాధ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూ వస్తోంది.  ఇక ఎన్నికల్లో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లడంతో కాంగ్రెస్ మరింతగా కుదేలయింది. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాట పడే పరిస్థితి కి వచ్చింది.


 ఇక ఇప్పుడిప్పుడే పార్టీ కాస్త పుంజుకుంటుంది అని అంతా అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మున్సిపల్ ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో కాంగ్రెస్ మనుగడ మీద అందరికీ సందేహాలు ఏర్పడ్డాయి. అయితే దీనిపై తాజాగా టి.పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. నిన్ను గాంధీభవన్ లో మాట్లాడిన అయన మొత్తం ఓటమి కి గల కారణాలు ఏంటి అనే విషయాలపై స్పందించారు. మిషన్ భగీరథ ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును అధికార టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించడం వల్ల ఇన్ని మున్సిపాలిటీలు ఆ పార్టీకి దక్కాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 


కేటీఆర్, కేసీఆర్ కొన్ని రోజులుగా ఓటర్ల జాబితా ఎన్నోసార్లు టిఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకుని  అనుకూల ఫలితాలు వచ్చే విధంగా కుట్రలు చేయడం వల్లే ఈ  ఫలితాలు వచ్చాయని అన్నారు. అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 సీట్లలో కాంగ్రెస్ కూటమి 8 సీట్లు గెలిచినా టిఆర్ఎస్ దొంగతనంగా అక్కడ ఎక్స్ అఫిషియో ఓటుతో గెలిచింది  అంటూ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ తప్పు ఏంటి అనేది గుర్తించకుండా ఇలా నిందలు వేయడం సరికాదని, తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ ను మర్చిపోయారంటూ టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: