అనుకున్నదొకటి... అయ్యింది ఒక్కటి... బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్ట ! అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇలా పాటలు పాడుకుంటున్నారు. జనసేన పార్టీని పెట్టిన తరువాత పోటీకి దూరంగా ఉన్నా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి బొక్క బోర్లా పడ్డాడు పవన్. అప్పుడు కానీ అర్ధం కాలేదు మాటలు చెప్పడం తేలిక, ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించడం కష్టం అని. అయినా కిందపడ్డా పై చేయి నాదే అన్నట్టుగా పవన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయ దూకుడు పెంచాడు. ప్రభుత్వం ఏర్పడిన పరిపాలన చేసేందుకు తొలినాళ్లలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటిని గురించి పట్టించుకోకుండా పవన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే తమ విధి అన్నట్టుగా రాజకీయాలు నడిపించారు.


 ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం, మూడు రాజధానుల ఏర్పాటు ఇలా అన్నిటిలోనూ తలదూర్చి పవన్ మరింతగా ప్రజల్లో విమర్శల పాలయ్యాడు. అయితే జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు  తన బలం సరిపోవడంలేదనే భావనకు వచ్చిన ఆయన గతంలో బీజేపీపై చేసిన విమర్శలు మరిచిపోయి మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దీని ద్వారా బాగా లబ్దిపొందవచ్చని పవన్ భావించారు. అయితే పెట్టుకోవడం వెనుక కూడా సరైన ప్రణాళిక కానీ, రాజకీయ వ్యూహం కానీ లేకుండా హడావిడిగా ఢిల్లీకి వెళ్లి బిజెపి చీఫ్ జేపీ నడ్డా తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయంటూ ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర బిజెపి పెద్దలు ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు. 


కనీసం పవన్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఏపీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇక అప్పటి నుంచి బిజెపి తన మార్కు రాజకీయం చూపించడం మొదలు పెట్టింది. జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని కలిసి ముందుకు వెళ్దామని ఒక అంగీకారానికి వచ్చి న తర్వాత ఏపీలో ఫిబ్రవరి 2వ తేదీన అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. కానీ ఆకస్మాత్తుగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ సంగతిని పక్కన పెట్టేసినట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. దీంతో కంగారు పడిన పవన్ హడావిడిగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి తన బాధ చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆయనకు అపాయింట్మెంట్ దక్కడం లేదు. 


 ఈ ఇద్దరిని కలవకుండా, వారితో కనీసం ఫోటో కూడా దిగకుండా ఏపీ కి వెళితే రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించిన ఏదో రకంగా అపాయింట్మెంట్ సంపాదించాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వారు మాత్రం పవన్ ను పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులు, శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర బీజేపీ పెద్దలు అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.


 ఇదే ఇప్పుడు పవన్ కు ఎక్కువ బాధను కలిగిస్తోంది. టిడిపితో కలిసి ప్రభుత్వంపై తాను విమర్శలు చేస్తున్న సమయంలో బిజెపి తనను కావాలనే ఇలా ఇరుకున పెట్టే విధంగా పొత్తు పేరుతో తనను కట్టడి చేసింది అనే విషయాన్ని పవన్ గ్రహించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మొదటి రెండు రోజులు పవన్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. మోదీ, అమిత్ షా తప్ప మిగతా బిజెపి నాయకులు అందరిని కలిసి బొకేలు ఇచ్చి భోజనాలు కూడా చేశాడు. దీంతో జనసేన పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. బిజెపి పొత్తు పెట్టుకున్నాము కనుక ఏపీలో జగన్ ప్రభుత్వంపై తాము పెత్తనం చేయవచ్చని అందరూ భావిస్తున్న సమయంలో బీజేపీ పెద్దలు జగన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: