మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను సిబిఐ అప్పగించాలని  కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు ను ఆశ్రయించడం  , జగన్ సర్కార్ ను ఆత్మరక్షణ లోకి నెడితే ,  అధికార పార్టీ ని టార్గెట్ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం  తెలుగుదేశం పార్టీకి పదునైన ఆయుధం లభించినట్లయింది . రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో పని చేసే సిట్ ను కాదని సునీతారెడ్డి సిబిఐ విచారణ కోరడం ఏమిటన్న సందేహం , సహాజంగానే  సామాన్యులకైనా  రావడం ఖాయం . ఎందుకంటే రాష్ట్రం లో తమ కుటుంబ సభ్యుడి నేతృత్వం లోనే ప్రభుత్వం కొనసాగుతున్న తరుణం లో సునీతారెడ్డి , తన తండ్రి హత్య కేసు  విచారణ సిబిఐ అప్పగించాలని కోరుతూ హైకోర్టు లో   పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది .

 

సునీతారెడ్డి ఎందుకు పిటిషన్ దాఖలు చేశారో తెలియదు కానీ టీడీపీ నాయకులు మాత్రం , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం లేకనే , తన తండ్రి హత్య కేసు విచారణ ను సిబిఐ కి అప్పగించాలని కోరుకుంటుందని కొత్త  భాష్యం చెబుతున్నారు . హైదరాబాద్ కు ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి ఆఘమేఘాల మీద వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు . తన సోదరిపై వత్తిడి తీసుకువచ్చి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేసేందుకే... వెళ్ళారా  ? అంటూ అనుమానం వ్యక్తం చేశారు .

 

గతం లో వివేకా హత్య కేసు పై సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి , తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు  . ఇదే విషయమై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదిక గా పలు విమర్శలు చేసిన విషయం తెల్సిందే . ఏది ఏమైనా వివేకా హత్య కేసు విచారణను సిబిఐ కి అప్పగించాలని సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్, రాజకీయంగా  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసేందుకు  టీడీపీ కి ఉపయోగపడిందనే  చెప్పాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: