రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ కి సిఫార్సు చేయడం
 , దానితో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ... మండలి రద్దు చేయాలని నిర్ణయించారు . అయితే ఈ రెండు బిల్లులపై  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందా ? లేదా?? అన్నది ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది . సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే మండలిలో,  బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , బొత్స సత్యనారాయణ లు సెలెక్ట్ కమిటీ కి చైర్మన్లు గా వ్యవహరించాలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు .

 

రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత మంత్రులు సెలెక్ట్ కమిటీ కి చైర్మన్లుగా వ్యవహరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పేర్కొంటున్నారు . అయితే మండలి రద్దు నిర్ణయం తీసుకోకముందే ,  అన్ని పార్టీలకు సెలెక్ట్ కమిటీ కి తమ సభ్యుల పేర్లు సూచించాల్సిందిగా  చైర్మన్ షరీఫ్ లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు ఎటువంటి లేఖ అందలేదని అంటోంది .  అదే సమయం లో అసెంబ్లీ అధికారులు కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న వాదన తో ఏకీభవిస్తున్నారు . ఇంతవరకు  పార్టీలకు ఎటువంటి లేఖలు వెళ్లలేదని చెబుతున్నారు . సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే మొదట బులెటిన్ విడుదల చేయాల్సి ఉంటుందని అంటున్నారు .

 

అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ కి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు గురించి విధి విధానాలు వెల్లడిస్తూ లేఖలు వెళ్లకపోవడంతో ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఎంతమాత్రం లేవని నిపుణులు చెబుతున్నారు . అయితే టీడీపీ వర్గాలు మాత్రం ఈ వాదనలు కొట్టిపారేస్తున్నాయి . సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: