తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికార పార్టీలు గళమెత్తాయి. విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయని టీఆర్ఎస్ గుర్తుచేస్తే.. కాగ్ లెక్కల ప్రకారం ఏపీకి 18 వేల కోట్లు రావాలని వైసీపీ చెప్పింది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సన్నాహకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగు రాష్ట్రాల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీలు. 

 

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సజావుగా జరగాలనే ఉద్దేశంతో.. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పార్టీల పార్లమెంటరీ నేతలు కూడా మీటింగ్ కు వచ్చారు. భేటీకి ప్రధాని మోడీ కూడా హాజరు కావడంతో.. విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ప్రస్తావించారు.

 

సీఏఏను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు రాజ్యసభలో ఆ పార్టీ నేత కేకే. గతంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడే తమ పార్టీ వ్యతిరేకించిందని, ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా కేసీఆర్ రెడీ అయ్యారని చెప్పారాయన. ప్రజల్లో అనవసర ఆందోళన రేకెత్తించడం మంచి పద్ధతి కాదన్నారు కేకే. 

 

దేశంలో ఎన్నో సమస్యలుండగా.. కేంద్రం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆరోపించారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయని, ఇవన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. 

 

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాగ్ అంచనాల ప్రకారం 18 వేల కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను కూడా ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు విజయసాయి రెడ్డి. బడ్జెట్ సెషన్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పట్టుబట్టాలని టీఆర్ఎస్, వైసీపీ డిసైడయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: