ఉత్తరాంధ్ర లో తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్తు లో ఇబ్బందులు తప్పవా ?, ప్రజల్లోకి రాజధాని ఉద్యమాన్ని తీసుకువెళ్లేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకరచన చేస్తోందా ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . విశాఖ లోని సెవెన్ హిల్స్ లోని టీడీపీ కార్యాలయాన్ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సహా విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడం పరిశీలిస్తే , అధికార పార్టీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

 

ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను  ప్రజల్లో తిరగలేని పరిస్థితిని తొలుత టీఆరెస్ నేతలు కల్పించే ప్రయత్నం చేశారని , ఒక్కసారి ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న తరువాత ప్రజలే వారిని గ్రామాల్లోకి రాకుండా  అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు .  విశాఖ ను పరిపాలన రాజధానిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోన్న టీడీపీ నాయకత్వం పై , తెలంగాణ లో టీఆరెస్ ప్రయోగించిన అస్త్రాన్ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోందని అంటున్నారు . అందుకే ఆ పార్టీ కార్యాలయం ముందు ధర్నా కు దిగి , పార్టీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా , రాజధాని ఉద్యమానికి ప్రజలు ఊతమిస్తారన్న భావన లో వైస్సార్ కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ఉన్నట్లుందని పేర్కొంటున్నారు . 


అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలే ముందుండి నడిపించగా, ఏపీ లో రాజధాని ఉద్యమాలను మాత్రం  ప్రధాన పార్టీలు తమ భుజానికెత్తుకుంటున్నాయి . అమరావతి లోనే  రాజధాని కొనసాగించాలని,  స్థానిక రైతులతో టీడీపీ ఉద్యమిస్తుంటే , ఇక విశాఖ లో రాజధాని కోసం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆందోళనలు చేయడం విమర్శలకు దారితీస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: