అనంతపురం జిల్లా పోలీసులు అమలు చేస్తున్న లాడ్జి మానిటరింగ్ సిస్టంతో పాత నేరస్తుల ఆటలకు అడ్డుకట్ట పడింది. లాడ్జిల్లో అపరిచితులుగా బస చేసి నేరాలకు పాల్పడాలనుకున్న పాత నేరస్తుల వ్యూహాలు, పథకాలు, కుట్రలు... నేరాలకు పాల్పడి తప్పించుకు తిరిగే క్రమంలో లాడ్జీ చేసే పాత నేరస్తుల పన్నాగాలు తలకిందలవుతున్నాయి. జిల్లాలో మొత్తం 329 లాడ్జిలు ఉన్నాయి. స్థానికులు కాని వారు వివిధ పనుల నిమిత్తం  ఆయా పట్టణాలకు వచ్చినప్పుడు లాడ్జీల్లో బస చేసి వెళ్లడం సర్వ సాధారణం. కానీ... కొందరు నేరస్తులు తమ కార్యకలాపాల వ్యూహరచనలు, పథకాలు, కుట్రలకు లాడ్జిలను వేదికగా చేసుకుని నేరాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక దశలో ఉగ్రవాదులు సైతం లాడ్జిల్లో బస చేసి వెళ్లారు. అంతేకాకుండా పాత నేరస్తులు చట్టానికి పట్టుబడకుండా తప్పించుకునేందుకు సైతం లాడ్జిలను వినియోగించుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగేవి. ఈక్రమంలో నేరస్తుల ఎత్తుగడలను జిల్లా పోలీసులు పసిగట్టి లాడ్జి యజమానులను అప్రమత్తం చేశారు. సాంకేతికతను జోడించారు. " ATP police LMS " ( అనంతపురము పోలీస్ లాడ్జి మానిటరింగ్ సిస్టం) అప్లికేషన్ ను రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని లాడ్జిలకు సంబంధించిన సిస్టమ్స్ లో " ATP police LMS " ( అనంతపురము పోలీస్ లాడ్జి మానిటరింగ్ సిస్టం) అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయించారు. ప్రతీ లాడ్జికు యూజర్ ఐ.డి, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చారు. దీని ప్రకారం లాడ్జిలో బస చేసేందుకు వచ్చిన వ్యక్తుల వివరాలు క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతాయి.

వారిలో ఎవరైనా పాత నేరస్తులుంటే తక్షణమే జిల్లా కేంద్రంలోని ఈ సర్వేలెన్స్ సెంటర్ కు తెలిసిపోవడం... అక్కడి నుండీ సంబంధిత అధికారులు మరియు సంబంధిత బ్లూకోల్ట్స్ విభాగానికి సమాచారం వెళ్లడం... ఆ వెంటనే పాత నేరస్తులు ఏ పనిపై బస చేసేందుకు వచ్చారో ఎంక్వైరీ చేసి తదనుగుణంగా చర్యలు చేపట్టడం జిల్లా పోలీసులకు నిత్యకృత్యమయ్యింది.  అఫెండర్ సర్వేలెన్స్ , ఫేస్ ట్రాకర్ యాప్ లకు ఈ లాడ్జి మానిటరింగ్ అప్లికేషన్ అనుసంధానించి ఉండటంతో పాత నేరస్తుల వివరాలు ఆగమేఘాలపై ఈ సర్వేలెన్స్ డ్యాష్ బోర్డులో తెలిసిపోతున్నాయి. లాడ్జికి వచ్చిన వారి పేరు , మొబైల్ నంబర్ ను ఈ అప్లికేషన్ లో ఎంటర్ చేస్తారు.

వెంటనే ఒ.టి.పి రావడం తద్వారా అప్లికేషన్ లో మళ్లీ ఎంటరయ్యి బస చేసేవారి ఆధార్ , వివరాలు అప్ లోడ్ చేస్తారు. అఫెండర్ సర్వేలెన్స్ , ఫేస్ ట్రాకర్ కు అనుసంధానమై ఉండటం వల్ల పాత నేరస్తులయితే వెనువెంటనే వారి వివరాలు సైతం క్షణాల్లో తెలిసిపోతున్నాయి. బస చేసే వారి వివరాలను సక్రమంగా ఈ అప్లికేషన్ లో అప్ లోడ్ చేస్తున్నారా లేదా అనే కోణంలో ఇప్పటి వరకు 1,45,757 సార్లు జిల్లాలో ఉన్న లాడ్జిలను చెక్ చేశారు. లాడ్జి మానిటరింగ్ సిస్టం అప్లికేషన్ ద్వారా 100 మందికి పైగానే పాత నేరస్తులు లాడ్జిల్లో బస చేసేందుకు వచ్చినట్లు గుర్తించి తదనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: